డబుల్ బెడ్రూమ్ ఇళ్లా మజాకా.. కట్టనే లేదు.. కూలిపోతున్నాయి.!
ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అభాసుపాలు అవుతోందా? కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా సర్కార్ లక్ష్యం నీరుగారిపోతోందా? నాసిరకం సామాగ్రితో నాణ్యత లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయా? సామాన్యుల కలల రూపం రెండు గదుల ఇళ్లు కలగానే మిగిలిపోనుందా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నాణ్యత బండారం బయటపడుతోంది. చిన్న వర్షానికే పేక మేడల్లా కుప్పకూలిపోతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో నాసిరకం సామాగ్రి వాడుతున్నారా, కాసుల కక్కుర్తిలో కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కవుతున్నారా అనే ఆరోపణలు జోరందుకుంటున్న వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటన చర్చానీయాంశంగా మారింది.

పేకమేడల్లా కూలుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు..!
డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు డిమాండ్ పెరిగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్దించి తొలిసారిగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకొచ్చింది. అయితే దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఆ క్రమంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించింది సర్కార్. బంపర్ మెజారిటీతో మళ్లీ టీఆర్ఎస్ అధికార పీఠమెక్కడంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వేరేలా కనిపిస్తోంది.
ఆ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతెలబోరు గ్రామవాసులు కూడా ప్రభుత్వ ఇళ్ల కోసం కాళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆశలు ఆడియాసలయ్యే ప్రమాదం ముంచుకొచ్చింది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూలిపోయే స్టేజీకి చేరుకున్నాయి. నిర్మాణం మధ్యలో ఉన్నప్పుడే ఇలాంటి సమస్యలు తలెత్తితే అవి ఎన్ని సంవత్సరాలు నిలబడతాయో తెలియని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు.

నిర్మాణమే పూర్తి కాలేదు.. అప్పుడే కూలుతున్నాయి..!
దంతెలబోరు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తికాకముందే మధ్యలోనే కూలిపోతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గోడలు పూర్తిగా తడిసిముద్దయ్యాయి. ఆ క్రమంలో కుప్పకూలిపోతున్నాయి. ఈ వర్షాలకే ఇలా కూలిపోతే వాటి నాణ్యత ఏమేర ఉందో ఇట్టే అర్థమవుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఈ దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇళ్ల నిర్మాణ సమయంలోనే ఇలా జరుగుతుంటే.. అవి పూర్తయి లబ్ధిదారులకు ఇచ్చాక ఎన్ని సంవత్సరాలు నిలబడతాయోనన్న గ్యారంటీ లేదంటున్నారు స్థానికులు. నాణ్యత లేక పేకమేడల్లా కూలుతున్న ఆ ఇళ్లు తమకు వద్దని ఖరాఖండిగా చెబుతున్నారు. భవిష్యత్తులో ఆ ఇళ్లల్లో నివాసం ఉన్నప్పుడు జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు.

కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యమే కారణమా..?
వేల కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పేదలకు ఆవాసం కల్పించాలనే బృహత్తర లక్ష్యంతో ముందుకెళుతున్న ప్రభుత్వ విధానాలకు ఆదిలోనే గండి పడినట్లవుతోంది. నాణ్యత లేకుండా ఇళ్ల నిర్మాణాలు జరిగితే అవి ఎంతకాలం నిలబడతాయో తెలియని పరిస్థితి. అంత ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు చేస్తుంటే.. కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యం వహించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు ఇలాంటి ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications