బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి; స్పందించిన మంత్రి కేటీఆర్, ఎంపీ నామా!!
ఖమ్మం జిల్లా చీమలపాడు ఏజెన్సీలోని కారేపల్లి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వద్ద జరిగిన దారుణ అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఇద్దరికి చేరింది. ఈ ప్రమాదంలో దాదాపు పది మంది గాయాల పాలు కాగా, 8మంది కాళ్లు చేతులు తెగిపోయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అగ్నిప్రమాదంలో గాయాలపాలైన వారు ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇక ఈ అగ్ని ప్రమాద ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్ వైరా నియోజకవర్గంలో కారేపల్లి అగ్నిప్రమాద ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలోని మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా అధికారులకు, నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వారితో ఫోన్లో కూడా సంభాషించిన మంత్రి కేటీఆర్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లా చీమలపాడు ఏజెన్సీ లో జరిగిన బిఆర్ఎస్ ఆత్మీయ సభలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ఎంపీ నామా నాగేశ్వరరావు స్పందించారు. ఈ అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను, గాయపడిన వారిని ఆదుకుంటామని ఆయన తెలిపారు. బాణాసంచా పేలడం వల్ల గుడిసెకు నిప్పు అంటుకోలేదని, ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని ఆయన పేర్కొన్నారు. ఇది చాలా బాధాకరమని పేర్కొన్న ఆయన, ప్రమాద స్థలానికి, సభాస్థలానికి మధ్య చాలా దూరం ఉందన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని, ప్రభుత్వం తరఫున వారందరినీ ఆదుకుంటామని ఎంపీ నామా నాగేశ్వరరావు వెల్లడించారు.












Click it and Unblock the Notifications