కర్నూలు నుంచి బీహార్‌కు అంబులెన్స్‌లో.. ప్రమాదంలో నలుగురు మృతి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నుంచి బీహార్‌కు అంబులెన్స్‌లో ఓ రోగిని తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ విషాదం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఆదివారం ఉదయం ఓ పాదచారుడిని ఢీకొట్టిన అంబులెన్స్ ఆ తర్వాత స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ మేరకు వివరాలను స్థానిక పోలీసులు వెల్లడించారు. జబల్పూర్-నాగ్‌పూర్ హైవేపై చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఐదుగురికి గాయాలైనట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అనిష్ షా(18) అనే రోగిని కర్నూలు నుంచి బీహార్‍లోని చంపారన్‍లో వారి స్వగ్రామానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద సమయంలో అంబులెన్స్‌లో ఇద్దరు డ్రైవర్లతోపాటు అనిషా కుటుంబసభ్యులు ఆరుగురు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని సియోని వద్దకు రాగానే ఆ అంబులెన్స్ ఒక్కసారిగా ఓ పాదచారుడిని ఢీకొట్టింది. ఆ తర్వాత వేగంగా వెళ్లి స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని ప్రమిత షా(35), ప్రిన్స్ షా(4), ముకేశ్ షా (36), సునీల్ షా (40)గా గుర్తించారు. గాయపడిన మరో ఐదుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలో నలుగురు మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది.
మరో ప్రమాదంలో ముగ్గురు వైద్యులు మృతి
ఓ కారు అదపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటన అనంతపురం జిల్లాలోని విడపనకల్లు వద్ద చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో కారు నుజ్జునుజ్జు కాగా.. మృతదేహాలు చెల్లచెదురుగా పడిపోయాయి.
తీవ్రమైన పొగమంచు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను బళ్లారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు యోగేశ్, గోవిందరాయ, అమరేశ్ గా గుర్తించారు. వీరంతా హాంకాంగ్ విహారయాత్రకు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications