న్యాయ రాజధానిగా కర్నూలు కోసం..!!
కర్నూలు: దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా ఇచ్చిన స్టే- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. మూడు రాజధానులను ఏర్పాటు చేయడంలో ఇప్పటివరకు ఉన్న న్యాయపరమైన చిక్కులు, ఇతర ఇబ్బందులు ఒక్కటొక్కటిగా తొలగిపోతున్నట్టుగానే భావిస్తోంది. ఈ క్రమంలో అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మూడు రాజధానులకు అవసరమైన కొత్త బిల్లు రూపకల్పనపై కసరత్తు మరింత ముమ్మరం చేసింది.

మూడు రాజధానుల్లో..
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాల్సి ఉంటుందని, ఆరు నెలల్లోగా దీని నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందంటూ గతంలో ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇక మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో జాప్యం చేయకూడదనే నిర్ణయానికి వచ్చింది వైఎస్ఆర్సీపీ.

బహిరంగ సభ కోసం..
ఈ క్రమంలో- ఇక కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించే ప్రక్రియ కూడా ఊపందుకోనుంది. కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించడానికి, అధికారాన్ని వికేంద్రీకరించడానికి నాన్ పొలిటికల్ జేఏసీ మద్దతు పలికింది. ఇందులో భాగంగా న్యాయ రాజధానిగా ప్రతిపాదించిన కర్నూలులో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఎల్లుండి ఈ సభను నిర్వహించనున్నట్లు నాన్ పొలిటికల్ జేఏసీ తెలిపింది.

రాయలసీమ గర్జన పేరుతో..
రాయలసీమ గర్జన పేరుతో ఈ బహిరంగ సభను నిర్వహించబోతోంది జేఏసీ. రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించాలని భావిస్తోంది. లక్షమంది వరకు ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తోన్నారు నాన్ పొలిటికల్ జేఏసీ ప్రతినిధులు. గతంలో విశాఖపట్నంలో నిర్వహించిన బహిరంగ సభను తలదన్నేలా దీన్ని ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.

పోస్టర్ రిలీజ్..
రాయలసీమ గర్జన పోస్టర్‌ను అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు విడుదల చేశారు. కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, చట్టసభల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాయలసీమ గర్జనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మూడు రాజధానుల ద్వారా అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందుతాయని, దీన్ని తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.

గర్జనకు మద్దతు..
ఈ సభకు వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటించింది. రాయలసీమకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. తమ ప్రభుత్వమే అధికార వికేంద్రీకరణను ప్రతిపాదించిన నేపథ్యంలో- వారి భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుందనేది తెలిసిన విషయమే. ఇదివరకు నాన్ పొలిటికల్ జేఏసీ- విశాఖపట్నంలో నిర్వహించిన సభను కూడా వైసీపీ నాయకులు విజయవంతం చేశారు. అదే తరహాల కర్నూలులో నిర్వహించ తలపెట్టిన సభకూ వైసీపీ నాయకులు అండగా ఉండనున్నారు.