దూసుకొచ్చి ఢీకొట్టిన బైక్: ఆర్టీసీ రాజధాని బస్సు దగ్ధం, వ్యక్తి మృతి
నల్గొండ: సూర్యపేట జిల్లా మునగాల మండలంలో ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొంది. తెలంగాణ ఆర్టీసీ(TSRTC)కి చెందిన రాజధాని బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇందిరానగర్ వద్దకు రాగానే బస్సును బైక్ వేగంగా ఢీకొట్టింది.
ఆర్టీసీ బస్సు కింది భాగంలోకి బైక్ వెళ్లడంతో మంటలు చెలరేగాయి. దీంతో మంటలు వేగంగా బస్సును అంటుకున్నాయి. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగిపోయారు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే బస్సు మొత్తం దగ్ధమైంది.

ఇక బైక్ నడిపిన మురుగేష్ రాజు(48)కి తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా.. రాజు ప్రాణాలు కోల్పోయాడు. ఈ బస్సు మియాపూర్ డిపోకు చెందినది.
ఇది ఇలావుండగా, ఏపీలోని ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో 6 గంటలకుపైగా రైలు నిలిచిపోయింది. ఆ తర్వాత విశాఖకు బయల్దేరింది. రైలు పట్టాలపై బొలెరో వాహనాన్ని వదిలి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications