అభయహస్తం పథకాన్ని కొనసాగించాలి: వైఎస్ షర్మిల
తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 25వ రోజు షర్మిల నకిరేకల్ నియోజకవర్గం నకిరేకల్ మండలం రామన్నపేట్గ్రామంలోని పద్మశాలీ కాలనీ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఆమె వెంట పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. కాలనీ నుంచి సిరిపురం లక్ష్మీనగర్, బోగారం, సిరిపురం గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. సిరిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించి, పిల్లలతో మాట్లాడారు. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకునేందుకు కష్టపడి చదవాలని సూచించారు. అనుకున్న రంగంలో రాణిస్తూనే సామాజిక సేవ చేయాలన్నారు. పుట్టిన ఊరుకు లేదా ప్రాంతానికి మేలు చేయాలని కోరారు. అనంతరం గ్రామంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత పాదయాత్ర వెల్లంకి గ్రామానికి చేరుకుంది. గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు.

వైయస్ఆర్ సువర్ణ పాలన ఎలా ఉండేదో ప్రజలకు వివరించారు. చివరిశ్వాస వరకు వైయస్ఆర్ ప్రజల కోసమే పనిచేశారని, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ మరణించారని భావోద్వేగానికి గురయ్యారు. వైయస్ఆర్ బిడ్డగా.. తాను కూడా చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తానని మాట ఇచ్చారు. అనంతరం గ్రామంలోని చేనేత కార్మికుల ఇండ్లకు వెళ్లి పలకరించారు. చేనేత ముడి సరుకులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీని భారీగా పెంచాయని, తద్వారా నేతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నూలుపై సబ్సిడీ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం రుణాలు ఇవ్వకపోవడంతో నేతన్నలు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారని వాపోయారు.
చేనేత రంగంలో వ్యాపారులకే లాభాలు వస్తున్నాయని, కార్మికులకు మాత్రం నష్టాలే మిగులుతున్నాయని పేర్కొన్నారు. వైయస్ఆర్ హయాంలో చేనేత కార్మికులకు రుణమాఫీ, రాయితీలపై ముడిసరుకులు, సొసైటీల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. YSR తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముడి సరుకులు సబ్సిడీపై మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. నేతన్నలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని మాటిచ్చారు. అర్హులందరికీ హెల్త్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకందరికీ జీవిత బీమా సదుపాయం కల్పించి ఆదుకుంటామన్నారు. అనంతరం పాదయాత్ర భువనగిరి నియోజకవర్గం వలిగొండ మండలం సుద్దబావిగూడెం గ్రామానికి చేరుకుంది. రైతులు, గౌడన్నలు, మహిళలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం గోల్నేపల్లి గ్రామానికి చేరుకుని.. అక్కడ మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు.












Click it and Unblock the Notifications