ఎన్నికల కోడ్: మిర్యాలగూడలో రూ. 5.73 కోట్ల బంగారం పట్టివేత
నల్గొండ: ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల తనిఖీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మిర్యాలగూడలో భారీగా బంగారం పట్టుబడింది. ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా.. మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో(టీఎస్ 09 యూఈ2479) వాహనంలో రూ. 5.73 కోట్లు విలువ చేసే బంగారం ఉన్నట్లు గుర్తించారు.
లభ్యమైన సుమారు 13 కిలోల బంగారానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో బంగారం, తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా పోలీసులు, అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.

కాగా, ఇటీవల సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుండగా.. జూన్ ఒకటిన జరిగే ఏడో విడత పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం తప్ప మిగతా ప్రాంతాల్లో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడించనున్నారు. ఆ రెండు చోట్ల జూన్ 2వ తేదీ కౌంటింగ్ నిర్వహించనుంది. దేశంలో మొత్తం 96.88 కోట్ల ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 49.7 కోట్ల మంది ఉండగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారు. ఇక ఈ ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు వినియోగిస్తున్నారు. 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో 1.5 కోట్ల మంది పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది పాలు పంచుకోనున్నారు.












Click it and Unblock the Notifications