అభివృద్ధికే జీ హుజూర్.. ప్రచారాన్ని కాంగ్రెస్ అడ్డుకోబోయింది, మంత్రి జగదీశ్, పల్లా ఫైర్
ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శమే హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకంలో కలిసికట్టుగా పనిచేశామని గుర్తుచేశారు. తామే అభ్యర్థులు అనుకొని నేతలు, శ్రేణులు భావించి కష్టపడ్డారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. పది నెలల నుంచి ప్రజల మధ్యే సైదిరెడ్డి ఉన్నారని గుర్తుచేశారు. కానీ విపక్ష నేతలు స్థాయి మరచి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో విపక్షాల కుటిల యత్నాలను ప్రజలు తిప్పికొట్టారని స్పష్టంచేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఏకమైనా ప్రజలు మాత్రం అభివృద్ధికే పట్టం కట్టారని జగదీశ్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. ప్రచారంలో భాగంగా కేసీఆర్ సభ రద్దయినా ప్రజలకు మాత్రం వాస్తవాన్ని కార్యకర్తలు చేరవేర్చారని తెలిపారు. శనివారం సాయంత్రం 4 గంటలకు హుజూర్‌నగర్‌లో కృతజ్ఞత సభ ఉంటుందని.. అదే ప్రాంగణంలో కేసీఆర్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి రోడ్ మ్యాప్ కూడా ప్రకటిస్తారని తెలిపారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ కంచుకోట అయినా నల్గొండ ఇక కనుమరుగైందని విమర్శించారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం కేసీఆర్ సర్కార్‌పై ప్రజ విశ్వాసానికి నిదర్శనమని ఉప ఎన్నికల ఇంచార్జీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అసత్యాలతో ప్రతిక్షాలు కుట్రలు చేశాయని విమర్శించారు. అభివృద్ధికి హుజూర్ నగర్ ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులను ప్రతిపక్షాలు ఇబ్బందికి గురిచేశాయని తెలిపారు. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి కోసం హుజూర్ నగర్ ప్రజలు పట్టం కట్టారని చెప్పారు.












Click it and Unblock the Notifications