వైసీపీ కంచుకోటలో ఏం జరుగుతోంది - ఎందుకీ పరిస్థితి..!?
వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా అండగా నిలిచింది. ప్రతీ ఎన్నికలోనూ పట్టం కట్టింది. పార్టీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లా వైసీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తరువాత మరొకరు పార్టీతో విభేదిస్తున్నారు. ఇదే జిల్లాలో ఇప్పటికి ఇద్దరు ఎమ్మెల్యేలు రెబల్స్ గా మారారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో సీనియర్ నేత పేరు ప్రచారంలోకి వచ్చింది.
నాడు జగన్ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆ నేత..ఇప్పుడు జగన్ మాట కాదని ప్రత్యర్ధి పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ప్రచారం సాగుతోంది. అసలు నెల్లూరు వైసీపీలో ఏం జరుగుతోంది.
వైసీపీ ఆవిర్భావం తరువాత జిల్లాలో జగన్ ను అనూహ్య మద్దతు లభించింది. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉప ఎన్నికలో ఎంపీగా వైసీపీ నుంచి గెలుపొందారు. ఆ తరువాత కాంగ్రెస్ - టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలకు ప్రజలు మద్దతుగా నిలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ జిల్లాలో ఏడు స్థానాలు గెలిచింది. కోవూరు, వెంకటగిరి, ఉదయగిరి స్థానాలు కోల్పోయింది.
2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం పది స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధించింది. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేసిన జిల్లాలో ఇప్పుడు సొంత పార్టీ నుంచే ప్రతిపక్షం వాయిస్ వినిపిస్తోంది. సీనియర్ నేతలు ఆనం.. కోటంరెడ్డి పార్టీ నాయకత్వంతో విభేదించారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వారిద్దరూ ఆత్మ ప్రభోదానుసారం ఓట్లు వేసామని చెబుతున్నారు.

దీని ద్వారా వారిద్దరూ టీడీపీకి ఓటు వేస్తారని ముందుగానే వైసీపీ నాయకత్వం అంచనాకు వచ్చింది. ఇప్పుడు ఈ జాబితాలో మరో సీనియర్ నేత చేరారు. మేకపాటి కుటుంబం తొలి నుంచి జగన్ కు మద్దతుగా నిలిచింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కొంత కాలంగా ప్రభుత్వం పైన అసమ్మతి స్వరం పెంచారు.
ఆయన నియోజకవర్గంలో సమన్వయకర్తను నియమించటం..వచ్చే ఎన్నికల్లో సీటు పైన హామీ దక్కకపోవటం ఆయన అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత సీఎం జగన్ ను ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి కలిసారు. ఆ తరువాత బెంగుళూరు వెళ్లిపోయారు. క్రాస్ ఓటింగ్ చేసారనే ఆరోపణల పైన స్పష్టత రాలేదు. అదే సమయంలో నెల్లూరులో పది ఎమ్మెల్యేల్లో ముగ్గురు దూరమయ్యారు.
2019 అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి నెల్లూరు జిల్లాలో నేతల మధ్య అనైక్యత స్పష్టంగా కనిపించింది. పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటుగా జిల్లా బాధ్యతలు చూస్తున్న మాజీ మంత్రులు పలుమార్లు నెల్లూరు నేతలతో సమావేశాలు నిర్వహించారు. గతంలో అనిల్, కోటంరెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డితో స్వయంగా సీఎం మాట్లాడారు.
ఆనం-కోటంరెడ్డి నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. దీంతో, పార్టీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లా వైసీపీలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ ఏం చేయబోతున్నారు.. ఎలాంటి చికిత్స చేస్తారు..టీడీపీ వ్యూహాలను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications