ఆనందయ్య మందుకు బ్రేక్- ఐసీఎంఆర్ అనుమతిస్తేనే- బ్లాక్‌లో రూ.3-10 వేలకు
నెల్లూరులో తక్కువ సమయంలో ప్రాముఖ్యం పొందిన ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం ఇవాళ బ్రేక్ వేసింది. ఇప్పటికే ఐసీఎంఆర్‌తో పాటు ఆయుష్ అధికారులతో ఈ మందుపై అధ్యయనం చేయిస్తున్న ప్రభుత్వం అనుమతులు వచ్చే వరకూ బ్రేక్ వేయాలని నిర్ణయించింది. దీంతో కరోనా మందు కోసం కృష్ణపట్నం వస్తున్న రోగులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. మరోవైపు ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్లో ఆనందయ్య మందు పేరుతో భారీ రేట్లకు విక్రయిస్తున్నారు.

ఆనందయ్య మందు నిలిపివేత
నెల్లూరులోని కృష్ణపట్నంలో ఉన్న ఆనందయ్య కరోనా మందు పంపిణీని ఏపీ ప్రభుత్వం ఇవాళ నిలిపేసింది. భద్రతా కారణాలతో నిన్ననే ఆనందయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనకు తగిన రక్షణ కల్పిస్తున్నారు. ఇవాళ కరోనా మందు పంపిణీని కూడా నిలిపేయడంతో రోగులు నిరాశ చెందుతున్నారు. ఇవాళ ఆనందయ్య ఇంటికి, మందు పంపిణీ కేంద్రానికి చేరుకున్న పోలీసులు... పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించారు. ఆనందయ్య కరోనా మందు పంపిణీ కేంద్రంలో ఉన్న తయారీ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఐసీఎంఆర్, ఆయుష్ అధ్యయనం నేపథ్యంలో
ప్రస్తుతం ఐసీఎంఆర్‌తో పాటు ఆయుష్ మంత్రిత్వశాఖ అధికారులు కూడా ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో రోగులకు మందు పంపిణీ చేయడం ద్వారా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వారం, పది రోజుల పాటు పంపిణీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఐసీఎంఆర్ అనుమతి లభిస్తే ప్రభుత్వమే ఈ ఆయుర్వేద మందును పంపిణీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

బ్లాక్‌లో 10 వేలకు ఆనందయ్య మందు
మరోవైపు ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ నిలిచిపోవడంతో బ్లాక్ మార్కెట్లో కేటుగాళ్లు దీని అమ్మకాలు మొదలుపెట్టేశారు. ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ 3 వేల నుంచి 10 వేల వరకూ దీన్ని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మంత్రి పేర్నినాని ఆనందయ్యను కలిసి తాజా పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. నాటు మందు తయారీ విధానంపైనా పేర్నినాని ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం అందిస్తామని ఆనందయ్యకు మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications