కిల్లీలు కట్టి, గుట్కాలు అమ్మి.. డాన్‌గా ఎదిగిన పాన్ షాప్ ఓనర్..!

నెల్లూరు : కిల్లీలు కట్టాడు, గుట్కాలు అమ్మాడు. చిన్న పాన్ షాపుతో జీవితం ప్రారంభించి గుట్కా డాన్‌గా ఎదిగాడు. పాన్ షాప్ ఓనర్‌గా రోజుకు రెండు మూడొందలు సంపాదించే వ్యక్తి తన సామ్రాజ్యం విస్తరించుకుని కోట్లకు పడగలెత్తాడు. ఎక్కడైతే బతకడానికి పాఠాలు నేర్చుకున్నాడో అక్కడే రాజభోగాలు అనుభవించేలా బాటలు వేసుకున్నాడు. చిన్న పాన్ షాపుతో జీవన ప్రస్థానం మొదలుపెట్టి ఎవరి అంచనాలకు దొరక్కుండా గుట్కా డాన్‌గా ఎదిగిన క్రమం పోలీసులను విస్తుపోయేలా చేసింది.

నెల్లూరులో గుట్కా తయారీ.. క్రమక్రమంగా వ్యాపారం పెంచుకుని..!

నెల్లూరులో గుట్కా తయారీ.. క్రమక్రమంగా వ్యాపారం పెంచుకుని..!


నెల్లూరు బాలాజీనగర్‌ ఏరియాకు చెందిన ప్రసాద్‌ అనే వ్యక్తి పాన్ షాప్ ఓనర్ నుంచి గుట్కా డాన్‌గా ఎదిగాడు. కొన్నేళ్ల కిందటి వరకు ట్రంకు రోడ్డులోని ఓ హోటల్ దగ్గర పాన్ షాప్ నడిపేవాడు. రోజుకు రెండు మూడు వందలు వచ్చే సంపాదనతో తృప్తి పడలేదు. ఆ క్రమంలో అడ్డదారులు తొక్కాడు. కొందరి సహకారంతో వెంకటాచలం, జనార్ధన్ రెడ్డి కాలనీల్లో గుట్కా తయారీ కేంద్రాలను స్థాపించాడు. ఆయా కంపెనీలకు చెందిన గుట్కా, ఖైనీలు బ్యాగుల కొద్దీ తయారు చేసి అమ్మేవాడు. తక్కువ కాలంలోనే కోట్లు గడించాడు.

క్రమక్రమంగా తన సామ్రాజ్యం విస్తరించుకున్నాడు. ప్రకాశం జిల్లాలోనూ గుట్కా తయారీ కేంద్రాలను స్థాపించాడు. ఆ క్రమంలో మేదరమిట్లలో నిషేధిత గుట్కా, ఖైనీ తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఇటీవల పోలీసులు దాడి చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. 3 కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు, ముడిసరుకు.. అమ్మడానికి సిద్దంగా ఉన్న గుట్కా ప్యాకెట్లు, ఖైనీ పొట్లాలు తదితర వస్తువలు స్వాధీనం చేసుకున్నారు.

ఇటుకల తయారీ పేరిట గుట్కాలు

ఇటుకల తయారీ పేరిట గుట్కాలు

2015వ సంవత్సరంలో ఇటుకల తయారీ పేరిట గుట్కా ప్యాకెట్ల ప్రొడక్షన్ మొదలుపెట్టిన ప్రసాద్ అనూహ్యంగా వెంకటాచాలం పోలీసులకు చిక్కాడు. ఆ క్రమంలో ఖాకీల దాడులు అధికం కావడంతో కొంతకాలం ఆ వ్యాపారం ఆపేశాడు. అలా నెల్లూరు నుంచి క్రమంగా తన మకాంను ప్రకాశం జిల్లాకు మార్చాడు. భారీగా గుట్కా, ఖైనీలు తయారుచేసి వివిధ జిల్లాలకు సరఫరా చేసి కోట్లు సంపాదించాడు.

పోలీసుల నుంచి తప్పించుకుంటూ..!

పోలీసుల నుంచి తప్పించుకుంటూ..!

2018, జనవరిలో పోలీసుల దాడిలో ప్రసాద్ అనుచరుడు శివ పట్టుబడ్డాడు. అతడి నుంచి 4 లక్షల రూపాయల విలువ చేసే సరుకు స్వాధీనం చేసుకున్నారు. అప్పటినుంచి కూడా ప్రసాద్ పోలీసులకు చిక్కలేదు. అదలావుంటే నెల్లూరు జిల్లా పోలీసులు నిఘా పెంచడంతో ప్రకాశం జిల్లా కేంద్రంగా చక్రం తిప్పాడు. అయితే ఇటీవల అద్దంకి పోలీసులు గుట్కా తయారీ కేంద్రంపై కన్నేశారు. విషయం తెలిసిన ప్రసాద్ తాళాలు వేసి మరోసారి పరారయ్యాడు. ఆ క్రమంలో గోడౌన్ షట్టర్లు పగులగొట్టి 3 కోట్ల విలువచేసే యంత్రాలు, ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ గోడౌన్ యజమాని హనుమంతరావును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడంలో మరిన్ని నిజాలు వెలుగుచూశాయి.

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గుట్కా తయారీ.. రాష్ట్రమంతటా సప్లై..!

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గుట్కా తయారీ.. రాష్ట్రమంతటా సప్లై..!

హనుమంతరావు ఇచ్చిన సమాచారం మేరకు నెల్లూరు రూరల్ మండలం పరిధిలోని అల్లీపురంలో ప్రసాద్ మరో గుట్కా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నాడని తేలింది. ఆ క్రమంలో అద్దంకి పోలీసులు నెల్లూరుకు చేరుకుని గుట్కా తయారీ కేంద్రంలో సోదాలు నిర్వహించారు. అక్కడ స్వాస్‌ పేరిట మౌత్‌ రీఫ్రెషనర్‌ ప్యాకెట్లు, అందులో వినియోగించే పదార్థాలతో పాటు యంత్ర పరికరాలు కనిపించాయి. అయితే గుట్కా, ఖైనీ ఇక్కడ తయారు కావడం లేదనే విషయం గుర్తించారు. గోడౌన్‌కు తాళాలు వేసి ఓనర్ నుంచి ప్రసాద్‌కు సంబంధించిన వివరాలు సేకరించారు. అయితే పాన్ షాప్ ఓనర్ నుంచి గుట్కా డాన్‌గా ఎదిగిన ప్రసాద్ మాత్రం పోలీసుల నుంచి ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నాడు. దీన్ని సవాల్‌గా తీసుకున్న పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+