కందుకూరుపై రాజకీయ దుమారం-పబ్లిసిటీ పిచ్చేనన్న వైసీపీ-కేంద్ర, రాష్ట్రాల సాయం-కేసు నమోదు
ఏపీలో కందుకూరు తొక్కిసలాట ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని 8 మంది చనిపోవడంతో దీనిపై అధికార వైసీపీ విమర్శలకు దిగింది. మరోవైపు తొక్కిసలాట ఘటనకు దారి తీసిన కారణాల్ని తెలుసుకుంటున్న ప్రభుత్వం .. ఇప్పటికే దీనిపై కేసు కూడా నమోదు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. చంద్రబాబు కందుకూరులోనే ఉండి పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నారు.

కందుకూరు తొక్కిసలాట
నిన్న చంద్రబాబు రోడ్ షో సందర్భంగా కందుకూరులో తొక్కిసలాట చోటు చేసుకుని 8 మంది చనిపోయారు. ఈ ఘటనతో టీడీపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. వెంటనే తేరుకుని టీడీపీ మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని ప్రకటించడమే కాకుండా అంత్యక్రియలు కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. చంద్రబాబు స్వయంగా కందుకూరులో పాగా వేసి పరిస్ధితుల్ని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై వైసీపీ విమర్శలకు దిగుతుండగా.. విపక్షాలు సానుభూతి ప్రకటిస్తున్నాయి.

మృతులకు కేంద్ర, రాష్ట్రాల పరిహారం
కందుకూరు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు టీడీపీ ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అలాగే ప్రధాని మోడీ రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు 50 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. కందుకూరు ఘటనపై సీఎం వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మరణించివారికి రూ.2 లక్షల చొప్పున , గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యనటలో ఉన్న ముఖ్యమంత్రి ఆమేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అండగానిలుస్తామన్నారు.
భద్రతా లోపాల వల్లేనన్న టీడీపీ
చంద్రబాబు పర్యటనల్లో భద్రతా లోపాలు చోటు చేసుకుంటున్నట్లు ఈ మధ్య తరచుగా ఆరోపిస్తున్న టీడీపీ.. ఇప్పుడు కందుకూరు ఘటనలోనూ అదే కారణమని పేర్కొంది. భద్రతా లోపాల వల్లే తొక్కిసలాట చోటు చేసుకుందని, దీనికి స్ధానిక పోలీసులే కారణమన్నట్లుగా టీడీపీ విమర్శలు చేస్తోంది. లేకపోతే చంద్రబాబు రోడ్ షోకు అనుమతి కూడా తీసుకున్న తమకు తగిన భద్రత ఇవ్వకపోవడమేంటని ప్రశ్నిస్తోంది. రోడ్ షోలో తొక్కిసలాట చోటు చేసుకోగానే వెంటనే స్పందించిన చంద్రబాబు.. అక్కడే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు.

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి అన్న వైసీపీ
కందుకూరు ఘటనకు చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చే కారణమని వైసీపీ నేతలు విమర్శించారు. చిన్న సందులో రోడ్ షో ఏర్పాటు చేయడమే ఓ తప్పయితే, అక్కడ చంద్రబాబు వాహనం నిర్దేశిత ప్రాంతం కంటే ముందుకు తీసుకెళ్లడం, భారీ బ్యానర్లు పెట్టడమే తొక్కిసలాటకు కారణమైందని వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రచార వ్యామోహం వల్లే 8 మంది చనిపోయారని, ఆయనకు విజనే లేదని మరో మంత్రి చెల్లుబోయిన వేణు విమర్శించారు. గతంలో గోదావరి పుష్కరాల పిచ్చితో 29 మందని పొట్టనబెట్టుకున్నారని, ఇప్పుడు 8 మంది చనిపోయారని వేణు ఆరోపించారు.
కందుకూరు ఘటనపై కేసు నమోదు
మరోవైపు కందుకూరు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్ కు ఇచ్చిన అనుమతికి విరుద్దంగా చంద్రబాబు రోడ్ షో నిర్వహించడం వల్లే ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు కేసులో పేర్కొన్నారు. సెక్షన్ 174 క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కందుకూరు పోలీసులు ప్రకటించారు. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన వారిపై దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలకు పోలీసులు సిద్దమవుతున్నారు. దీంతో పోలీసులు ఈ కేసులో ఎవరెవరిని బాధ్యుల్ని చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది












Click it and Unblock the Notifications