ఏడేళ్ళుగా అన్యాయం జరుగుతుంటే ఏం చేశారు .. రైతుల విషయంలో కేసీఆర్ వన్నీ నాటకాలు : బండి సంజయ్
తెలంగాణా సీఎం కేసీఆర్ పై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. నదీ జలాల విషయంలో కుట్రలో భాగంగానే సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్ భేటీకి ముందు లేఖ రాయడం వెనుక ఆంతర్యమేంటి అని బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను నిలదీశారు. గతంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ పెట్టినప్పుడు సీఎం కేసీఆర్ నే వాయిదా వేయించారని గుర్తు చేశారు.
ఎల్ఆర్ఎస్ రద్దు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కోసం బీజేపీ నిరసన .. ఉద్రిక్తత,అరెస్ట్ లపై బండి సంజయ్ ఫైర్

సీఎం కేసీఆర్ తీరుతోనే రైతులకు నష్టం
సీఎం కేసీఆర్ వల్ల రైతులకు నష్టం జరుగుతుందని, రైతుల కష్టాలకు ఆయనే కారణమంటూ నిప్పులు చెరిగారు బండి సంజయ్. గత ప్రభుత్వాలు అసంబద్ధ వ్యవసాయ విధానాల వల్ల రైతులకు సమస్యలు వచ్చి పడ్డాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవసాయ బిల్లులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు చెప్పకుండానే నాటకాలాడుతున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ వ్యవసాయ బిల్లులు వ్యతిరేకించటానికి కారణం ఏంటి ?
సీఎం కేసీఆర్ ఎప్పుడూ పబ్బం గడుపుకునే వ్యవహారమే చేస్తారని, ప్రజలను మభ్యపెట్టే పిట్టకథలు చెబుతున్నారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకువస్తే సీఎం కేసీఆర్ సరైన కారణాలు చెప్పకుండా దానిని వ్యతిరేకిస్తున్నారన్నారు. సరైన కారణాలను చెప్పాలన్నారు. 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే, రైతులకు మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 26వ తేదీన నూతన వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన రోజున స్వాతంత్ర్యం వచ్చినట్లుగా బండి సంజయ్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఉనికి కోసమే .. కేసీఆర్ కు రైతుల సంక్షేమం పట్టదు
6,850 కోట్ల రూపాయలతో వ్యవసాయ ఉత్పత్తుల కల్పనకు కేంద్రం ఖర్చు చేయబోతోందని, బూత్ స్థాయి నుంచి ప్రజలకు అర్థమయ్యేలా వ్యవసాయ బిల్లుల ప్రయోజనాల గురించి చెబుతామని బండి సంజయ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ కేవలం తమ ఉనికిని చాటుకోవడం కోసమే నూతన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తుందని, రైతుల నుండి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిందని ఆయన విమర్శించారు. రైతుల మద్దతు కాంగ్రెస్ పార్టీకి లేదని తేల్చిచెప్పారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీకి కానీ, కెసిఆర్ కి కానీ రైతులు బాగుపడటం ఇష్టంలేదని బండి సంజయ్ పేర్కొన్నారు.