Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోకసభ ఎన్నికలు 2019: నిజామాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

Recommended Video

    Lok Sabha Election 2019 : Nizamabad Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

    1952లో ఏర్పడ్డ నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట అని చెప్పొచ్చు. 1952-91 వరకు వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. 1967లో మాత్రం స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అనంతర కాలంలో మూడుసార్లు తెలుగుదేశం అభ్యర్థుల హవా కొనసాగింది. తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ఈ నియోజకవర్గంలో బీజేపీ ఇంతవరకు బోణీ కొట్టలేదు. తెలంగాణ ఉద్యమంతో ప్రజలకు చేరువైన టీఆర్ఎస్ పార్టీ 2014లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం కైవసం చేసుకుంది. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కోరుట్ల, జగిత్యాల, ఆర్మూర్, బోధన్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జనరల్ స్థానాలే కావడం విశేషం.

    1952లో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి హరీశ్ చంద్ర విజయం సాధించారు. అనంతరం 1957, 1962 జరిగిన ఎన్నికల్లో ఆయనే తిరిగి విజయం సాధించారు. నియోజకవర్గం ఏర్పడ్డ తొలినాళ్లల్లోనే హ్యాట్రిక్ ఎంపీగా రికార్డు సృష్టించారు. 1967లో ఇండిపెండెట్ విజయం సాధించారు. 1971, 1977, 1980లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గెలుపొందారు. 1984, 1989 ఎన్నికల్లో తాడూర్ బాలాగౌడ్ కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 1991, 1998, 1999లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గడ్డం గంగారెడ్డి గెలిచారు. 1996లో కాంగ్రెస్ నుంచి ఆత్మచరణ్ రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. 2004, 2009లో హస్తం గుర్తుపై పోటీచేసిన మధు యాష్కీ గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయం సాధించారు.

    నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల శాతం చూసినట్లయితే మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 14,96,193 మంది ఓటర్లున్నారు. అందులో 48.42 శాతంతో పురుషుల ఓట్లు 7,24,457 ఉండగా, 51.58 శాతంతో 7,71,736 మహిళల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ స్త్రీ, పురుషుల నిష్పత్తి 1065 : 1000.

    1952లో తొలిసారిగా నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి మొదలైన ఎన్నికలు ఇప్పటివరకు 16 సార్లు జరిగాయి. మొదటినుంచి కూడా నిజామాబాద్ లో కాంగ్రెస్ ఆధిపత్యం నడుస్తోంది. మధ్యలో తెలుగుదేశం పార్టీ హవా నడవడంతో మూడుసార్లు ఆ పార్టీ అభ్యర్థి ఎంపీగా గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2004-2009 టర్మ్ లో కొన్నిచోట్ల టీఆర్ఎస్ ఎంపీలు రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు జరిగాయి. అయితే ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ ఆ పార్టీకి చెందినవారే కావడంతో రాజీనామా చేయలేదు. దీంతో అక్కడ ఉపఎన్నికలు జరగలేదు.

    #LokSabhaElection2019: All about Nizamabad Constituency

    2014లో నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన కల్వకుంట్ల కవిత.. 1, 67,184 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కీపై విజయం సాధించారు. 69.11 శాతంతో 10 లక్షల 33వేల 924 ఓట్లు పోలయ్యాయి. అందులో కవితకు 42.49 శాతంతో 4,39,307 ఓట్లు పోలయ్యాయి. మధు యాష్కీకి 26.32 శాతంతో 2,72,123 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మినారాయణకు 2,25,333 (21.79%) ఓట్లు పోలయ్యాయి.

    తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ తరువాత తెలంగాణాలో 3వ అతిపెద్ద నగరం నిజామాబాద్. గతంలో ఇందూరు మరియు ఇంద్రపురి అని పిలిచేవారు. జిల్లాలో చారిత్రక శిల్పసంపదకు కొదవలేదు. రాజులు ఏలిన సంస్థానాలలో నేటికీ చారిత్రక కట్టడాల ఆనవాళ్ళు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములపై హిందు, ముస్లిం సామాజికవర్గాలు ఇక్కడ సమానంగా ప్రభావం చూపిస్తాయని చెప్పొచ్చు.

    సర్వమత సమ్మేళనానికి ప్రతీక నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్. హిందువులు, ముస్లింలు, సిక్కులు ఇలా భిన్నమతాలకు చెందినవారు ఐకమత్యం చాటుతూ జీవనం సాగిస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంటరీ స్థానంలో ప్రజల జీవనాధారంగా వ్యవసాయం, బీడీ పరిశ్రమ ప్రధాన పాత్ర పోషిస్తాయి.

    నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ లో పుణ్యక్షేత్రాలు, గడులు, కోటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. దోమకొండ, సిర్నాపల్లి, కౌలాస్ సంస్థానాల ఆనవాళ్ళు నేటికీ పదిలం.
    నీలకంఠేశ్వరాయలయం, సారంగాపూర్ హనుమాన్ ఆలయం, తిలక్ గార్డెన్, ఖిల్లా, తెలంగాణ విశ్వవిద్యాలయము మొదలయినవి. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్,, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్,, పోచారం, ఆలీసాగర్, నిజామాబాదు కోట, డిచ్‌పల్లి రామాలయం, దోమకొండ కోట, ఖిల్లా రామాలయం, భిక్కనూరు శ్రీ సిద్దరామేశ్వర దేవాలయం, రామారెడ్డి శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం, సంతాయిపేట్ శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం, మల్లారం అడవి, అశోక్ సాగర్, సారంగాపూర్, ఆర్మూరు రోడ్డు లోని శిలలు మొదలైనవి జిల్లాలోని కొన్ని పర్యాటక ఆకర్షణలు. నిజామాబాదులోని జిల్లా పురాతత్వ ప్రదర్శనశాలలో పాతరాతియుగం నుండి విజయనగర సామ్రాజ్య కాలం వరకు మానవ నాగరికత పురోగతిని తెలియజేసే పురాతన వస్తువులు ఉన్నాయి. 2001 అక్టోబరులో ప్రారంభమైన ఈ ప్రదర్శనశాలలో పురాతత్వ విభగం, శిల్పకళా విభాగం, కాంస్య, అలంకరణ విభాగం అనే మూడు విభాగాలు ఉన్నాయి. బిద్రీ వస్తువులు మరియు అనేక రకాలైన ఆయుధాలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి.

    నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత పనితీరుకు ప్లస్ పాయింట్లెంతో మైనస్ పాయింట్లు అంతే అని చెప్పొచ్చు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినా పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోవడం తీరని లోటు. అలాగే బోధన్ షుగర్ ఫ్యాక్టరీతో పాటు మెటుపల్లి సమీపంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించకపోవడం.. ఆమె పట్ల జనాల్లో వ్యతిరేకతను పెంచింది. ఏళ్లకొద్దీ ఎదురుచూసిన నిజామాబాద్ - పెద్దపల్లి రైల్వే లైను కవిత హయాంలో పూర్తికావడం విశేషం. కేంద్రం మీద వత్తిడి తెచ్చి 329 కోట్లు మంజూరుచేయించి మూడేళ్లలో దాన్ని పూర్తిచేయించారు. జాతీయ రహదారుల కోసం 231 కోట్లు, నిజామాబాద్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 230 కోట్లు మంజూరు చేయించారు. లక్కంపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం పతంజలి సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఫుడ్ పార్క్ పనులు స్పీడప్ చేశారు.

    రాష్ట్ర విభజన సమస్యలపై పార్లమెంటులో విస్తృతంగా చర్చించారు ఎంపీ కవిత. అలాగే రాష్ట్రానికి కేంద్రీయ విద్యాలయాలు వీలైనంత ఎక్కువగా రప్పించేలా కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా 41 చర్చల్లో పాల్గొన్నారు. సభలో 282 ప్రశ్నలు (as on 02.01.2019) లెవనెత్తారు. పసుపు బోర్డు కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు సహా 3 బిల్లులు ప్రవేశపెట్టారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు 12 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అందులో ప్రధానంగా మహిళా భవనాలు, ఎస్సీ-బీసీ కమ్యూనిటీ భవనాలు, రైతు భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యమిచ్చారు. 30 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భవనం రోల్ మోడల్ గా నిలుస్తోంది. కవిత దత్తత తీసుకున్న రెండు గ్రామాలు కూడా అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నాయి. బోధన్ సెగ్మెంట్ పరిధిలోని కందకుర్తిలో సీసీ రోడ్లు పూర్తయ్యాయి. అలాగే ప్రైమరీ స్కూల్ ను హైస్కూల్ స్థాయికి తీసుకొచ్చారు. మరుగుదొడ్లు, అంగన్ వాడీ కేంద్రాలు, 70 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి చేయించారు. అటు జగిత్యాల సెగ్మెంట్ పరిధిలోని అంతర్గాం గ్రామస్థులకు ఉపయోగపడే ఎస్సారెస్పీ కాలువ పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ 70 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా నిర్మిస్తున్నారు.

    నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ లో ఇంతవరకు బీజేపీ ఖాతా తెరవలేదు. అయితే 2019 ఎన్నికల్లో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్నారు ఆ పార్టీ నేతలు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయఢంకా మోగించినా.. ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ ఆధిపత్యమే కొనసాగింది. అయితే మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో ఆ రెండు పార్టీల ఓటుబ్యాంకు పదిలంగా కనిపిస్తోంది. ఈనేపథ్యంలో నిజామాబాద్ లోక్‌సభ 2019 ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందిన కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకోవడం కోసం లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా అభివృద్ధి పేరుతో సమరానికి సై అంటోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ తన పట్టు నిలుపుకోవడం కోసం ఈ సెగ్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+