ఒంగోలు నడిరోడ్డుపై..
Ongole: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీన ఆరో విడత పోలింగ్ జరుగనుంది. ఇప్పటివరకు అయిదు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ సహా మొత్తం 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 13వ తేదీన పూర్తయింది. ఆరు, ఏడు విడతల్లో పోలింగ్ ప్రక్రియ ముగియాల్సి ఉంది.
ఈ నెల 25, జూన్ 1 తేదీల్లో ఈ రెండు విడతలు షెడ్యూల్ అయ్యాయి. అక్కడితో దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అదే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏపీ సహా కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఏ పార్టీ అనేది అప్పుడే తెలిసిపోతుంది.

కాగా ఏపీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నారు. పోలింగ ముగిసిన అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి దాడులు సంభవించనివ్వకుండా ఏర్పాట్లు చేస్తోన్నారు.
ఇందులో భాగంగా- ఒంగోలులో మాక్ డ్రిల్‌ను నిర్వహించారు ఏపీ పోలీసులు. హింసాత్మక పరిస్థితులు తలెత్తినప్పుడు ఎలా వ్యవహరించాలనే విషయంపై మాక్ డ్రిల్ చేపట్టారు. టైర్లను కాల్చి రోడ్లపై పడేశారు. పెట్రోల్ నింపిన సీసాలను గాల్లోకి విసిరేశారు. పెద్ద ఎత్తున లాఠీఛార్జీ చేశారు.
అల్లరి ముూకలను చెదరగొట్టడానికి గాల్లోకి సైతం కాల్పులు జరిపారు. ఈ దాడుల సందర్భంగా గాయపడ్డ పోలీసులను యుద్ధ ప్రాతిపదికన ఎలా ఆసుపత్రికి తరలించాలనే విషయంపైనా కసరత్తు చేశారు. అంబులెన్సులను కూడా సంఘటన స్థలంలో అందుబాటులో ఉంచారు.

అచ్చంగా రణరంగాన్ని తలపించేలా సాగింది ఈ మాక్ డ్రిల్. స్థానికులు పెద్ద ఎత్తున దీన్ని తలకించారు. అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్ మోతలతో సంఘటన స్థలం మొత్తం మారుమోగిపోయింది. అనంతరం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో విధి నిర్వహణలో ఉన్న సమయంలో దాడులకు పాల్పడిన అల్లరి మూకలను చెదరగొట్టడంపై దృష్టి సారించారు.
పోలింగ్ తరువాత రాష్ట్రంలో పలు చోట్ల దాడులు- ప్రతిదాడులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మాచర్ల, నరసరావుపేట, చిత్తూరు జిల్లా చంద్రగిరి వంటి పలు నియోజకవర్గాల్లో పోలింగ్ తరువాత హింసాత్మక పరిస్థితులు చెలరేగాయి. దీనిపై వైఎస్ఆర్పీపీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య మాటల దాడి చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications