Highway Killer: మున్నా కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు: 12 మంది ఉరిశిక్ష
ఒంగోలు: నాలుగు రాష్ట్రాల పోలీసులను కొన్నేళ్లపాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన కరడుగట్టిన నేరస్తుడు, హైవే కిల్లర్‌గా ముద్రపడిన గ్యాంగ్‌స్టార్ మున్నా కేసులో ఒంగోలు న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. మున్నాతో సహా ఈ కేసులో ప్రమేయం ఉన్న 12 మందిని దోషులుగా గుర్తించింది. వారికి ఉరిశిక్షను విధించింది. ఈ మేరకు ప్రకాశం జిల్లా న్యాయస్థానం కొద్దిసేపటి కిందటే తీర్పు వెలువడించింది. ఈ మధ్యకాలంలో 12 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఓ న్యాయస్థానం తీర్పు ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ హత్యకేసులో ప్రమేయం ఉన్నవారందరికీ శిక్ష పడినట్టయింది.
మున్నా అసలు పేరు మహ్మద్ అబ్దుల్ సమద్. నేర ప్రపంచంలో మున్నాభాయ్, హైవే కిల్లర్‌గా గుర్తింపు పొందాడు. 16 మందితో ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడతను. చెన్నై-కోల్‌కత జాతీయ రహదారిని అడ్డగా మార్చుకునేది అతని గ్యాంగ్. జాతీయ రహదారులపై రాకపోకలు సాగించే లారీలు, దూర ప్రాంతాలకు చెందిన ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని దారిదోపిడీలకు పాల్పడేది. దోపిడీ సమయంలో అడ్డుకోవడానిక ప్రయత్నించిన లారీ డ్రైవర్, క్లీనర్లను హతమార్చేది. ఇలా 14 నేరాల్లో ఆ ముఠా ప్రమేయం ఉంది.

ఈ గ్యాంగ్‌లో మున్నాతో పాటు ఎస్‌కే రియాజ్, సయ్యద్ హిదయతుల్లా, మహ్మద్ జమాలుద్దీన్, బటాలా సాల్మన్, వై చిన్న వీరస్వామి, జీ భానుప్రకాష్, రాచమల సంపత్, జీ శ్రీధర్, ఎస్‌కే హఫీజ్, ఏ గంగాధర్ రావు, ఎస్‌కే కమాల్ సాహెబ్, ఎస్‌కే రహంతుల్లా, ఎస్‌కే దాదాపీర్, ఎస్‌కే ఇర్ఫాన్, ఎస్‌కే రఫీ ఉన్నారు. 2008లో ఈ గ్యాంగ్ తమిళనాడుకు చెందిన రామర్ శంకర్, పెరుమాళ్ సుబ్రహ్మణ్యం, ఏపీకి చెందిన జీ శ్యాంబాబు, జీ వినోద్ కుమార్, బిహార్‌కు చెందిన భూషణ్ యాదవ్, చందన్ కుమార్ మహతోలను హత్య చేసింది. ప్రకాశం జిల్లా పరిధిలో చెన్నై-కోల్‌కత జాతీయ రహదారిపై ఈ హత్యలు చోటు చేసుకున్నాయి.
వారిపై మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. మొత్తం 14 మందిని హత్య చేసినట్లు వారిపై కేసులు నమోదయ్యాయి. వాటిపై ప్రకాశం జిల్లా న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువడించింది. ప్రధాన దోషి మున్నా సహా 12 మందికి మరణశిక్షను విధించింది. మరో ఏడుమందికి యావజ్జీవ కారాగారశిక్షను విధించింది. ఈ ఏడింట్లో మూడు కేసుల్లోనే ఈ గ్యాంగ్ మొత్తం దోషులుగా తేలింది. ఇంకా నాలుగు కేసులకు సంబంధించిన తీర్పులు వెలువడాల్సి ఉంది. ప్రధానంగా ఇనుము లోడుతో వెళ్తోన్న లారీలనే వారు లక్ష్యంగా చేసుకునే వారని పోలీసుల దర్యాప్తులో తేలింది. డ్రైవర్, క్లీనర్లను హత్య చేసిన అనంతరం ఇనుమును స్ప్రాప్ దుకాణాల్లో విక్రయించే వారు. మృతదేహాలను నదీ తీరాల్లో పాతిపెట్టేవారు.












Click it and Unblock the Notifications