bandi sanjay bjp hyderabad ghmc elections dubbaka బీజేపీ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు దుబ్బాక politics
టీఆర్ఎస్‌కు ఉరితాడే! పవన్ పార్టీతో కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో.: బండి సంజయ్
హైదరాబాద్/దుబ్బాక: టీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఉరితాడుగానే మారుతుందన్నారు.
పేదలపై భారం మోపి.. ఖజానా నింపుకుంటారా?: నిజాంకు పట్టినగతే.: కేసీఆర్పై బండి సంజయ్

టీఆర్ఎస్ పార్టీకి అదే ఉరితాడు.. జనసేనతో కలిసి..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇద్దరి పిల్లల నిబంధనలను తొలగించడాన్ని బీజేపీ ఖండిస్తోందన్నారు. ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపే టీఆర్ఎస్ పార్టీకి ఉరితాడుగా మారుతుందన్నారు. ఆంధ్ర సహా ఇతర రాష్ట్రాల సెటిలర్లు గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తామని సంజయ్ చెప్పారు. టీఆర్ఎస్ సర్కారుకు బుద్ది చెప్పడానికి కలిసి వచ్చే వారందర్నీ కలుపుకుని వెళ్తామన్నారు.

దుబ్బాకలో అవే ఫలితాలు..
ప్రజా సమస్యలపైనే గ్రేటర్‌లో తన పర్యటన ఉంటుందని బండి సంజయ్ తెలిపారు. ఇక పార్లమెంటు ఎన్నికల ఫలితాలే దుబ్బాక ఉప ఎన్నికల్లో పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితానికి.. రాబోయే ఎన్నికలకు సంబంధం లేదన్నారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల మాదిరి దుబ్బాకను ఎందుకు అభివృద్ధి చేయలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.

ఎమ్మెల్యే రాజా సింగ్‌కు తోడుగా రఘునందన్..
ఎమ్మెల్యే రాజా సింగ్‌కు అసెంబ్లీలో.. మరో ఉద్యమకారుడు తోడు కాబోతున్నాడని బండి సంజయ్ అన్నారు. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ డబ్బులు తీసుకున్నా.. ఓటు మాత్రం బీజేపీకి వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

దుబ్బాకలో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరు..: రఘునందన్
మరోవైపు దుబ్బాకలో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని దుబ్బాక పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. 14న మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. తన నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరవుతారన్నారు. తనను గెలిపిస్తే ప్రజల కష్ట సుఖాల్లో అందుబాటులో ఉంటూ దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని చెప్పారు. కాగా, దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత బరిలో ఉండగా, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీలో నిలిచారు.