శ్రీకాకుళం జిల్లాలో చేపల కూర చిచ్చు : స్నేహితుడి హత్య , జైలుపాలైన ఏడుగురు
శ్రీకాకుళం జిల్లాలో చేపల కూర చిచ్చుపెట్టింది. ఆనవసరంగా ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది . కేవలం చేపల కూర కోసం ఓ వ్యక్తి స్నేహితుడిని హత్య చేసాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఒక వ్యక్తి చేపల కూర కోసం స్నేహితుడి హతమార్చిన ఘటన అటు పోలీసులను, ఇటు స్థానికులను షాక్ కు గురి చేసింది. ఇక ఈ హత్య గావించిన నిందితుడితో పాటుగా ఘటనతో ప్రమేయం ఉన్న ఏడుగురిని జైలుపాలు చేసింది.

చేపల కూర దగ్గర స్నేహితుల పంచాయితీ
హత్యకు కారణమైన చేపల కూర లొల్లి వివరాల్లోకి వెళితే .. కాకినాడకు చెందిన పాండురంగడు అనే వ్యక్తి అవలింగిలో నివాసముంటూ రక్షిత నీటి పథకానికి సంబంధించిన పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సంక్రాంతికి ఇంటికి వెళ్లిన పాండురంగడు ఇటీవల తనతో పాటు కాకినాడకు చెందిన స్నేహితుడైన పాలమూరు ప్రసాద్ ను అవలింగి తీసుకు వచ్చాడు. ఇక వీరిద్దరూ, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ రోజు రాత్రి చేపల కూర వండుకున్నారు. తినడానికి ముందు పార్టీ చేసుకున్న వీరంతా మద్యం తాగారు. తరువాత చేపల కూర దగ్గరకు వచ్చేసరికి పాండురంగడు కు, ప్రసాద్ కు మధ్య గొడవ తలెత్తింది.

తాగిన మత్తులో ఘర్షణ .. తీవ్రంగా కొట్టి స్నేహితుడిని చంపిన వ్యక్తి
చేప ముక్కల దగ్గర ఇద్దరూ గొడవకు దిగారు. నువ్వు ఎక్కువ తిన్నావ్ అంటే నువ్వు ఎక్కువ తిన్నావ్ అంటూ వాగ్వాదానికి దిగిన ఇద్దరు సహనం కోల్పోయి ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘర్షణలో పాండురంగడు మంచం కోడు తో ప్రసాదు తల పైన, చేతుల పైన విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన ప్రసాద్ అక్కడికక్కడే మరణించాడు. దీంతో ఎం చెయ్యాలో అర్ధం కాని పాండురంగడు ఆ ఘటన జరిగిన సమయంలో ఉన్న స్నేహితులతో పాటుగా, మరో కొందరి సహాయంతో మృతదేహాన్ని ఖననం చేసి కేసు నుండి తప్పించుకునే ప్రయత్నం చేశాడు .

మృతదేహం ఖననం ..పోలీసుల దర్యాప్తు .. నిందితులు అరెస్ట్
చెత్త సేకరణ బండిలో ప్రసాద్ మృతదేహాన్ని తీసుకువెళ్లి చెరువు గట్టుపై పాతిపెట్టాడు.
ఇక ఈ విషయం బయటకు పొక్కడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. విచారణలో భాగంగా హత్య చేసిన పాండురంగడుతో పాటుగా అతనికి సహకరించిన మరో ఐదుగురిని, కాకినాడకు చెందిన ఒక కాంట్రాక్టర్ ను మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు సారవకోట పోలీస్ స్టేషన్ కు తరలించి
వారిని విచారిస్తున్నారు.