కాల్ డేటాలో గుట్టు: చేతిలో నేతల చిట్టా, విచారణలో పాశం షాకింగ్ విషయాలు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో కాల్ డేటా కీలకంగా మారింది. అరెస్టైన నిందితులు తమ విచారణలో వెల్లడించని అంశాలు కూడా కాల్ డేటాలో వెలుగు చూస్తున్నాయి. నయీం ఇంట్లో పోలీసులు పెద్ద మొత్తంలో సెల్ ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
వాటిలో చాలా సిమ్ కార్డుల నుంచి చాలా తక్కువగా మాట్లాడినట్లుగా గుర్తించారు. రెండు మూడు ఫోన్ కాల్స్ మాత్రమే ఆ సిమ్ కార్డుల నుంచి వెళ్లినట్లుగా గుర్తించారని తెలుస్తోంది. పలువురు రాజకీయ నాయకులు, ఇతర అధికారులతో మాట్లాడినట్లుగా కూడా బహిర్గతమైనట్లు తెలుస్తోంది.

సిట్ దర్యాఫ్తులో కాల్ డేటా కూడా కీలకంగా మారింది. దీంతో కాల్ డేటాను కూడ సిట్ కీలకంగా తీసుకుటోంది. నయీం నేరాలకు అండదండలందించిన నాయకులు, పోలీసు అధికారుల గుట్టు సిట్ చేతికి చిక్కిందని అంటున్నారు. ఈ వివరాలను అతని అనుచరులు పాశం శ్రీనివాస్, భువనగిరి ఎంపీపీ తోటకూర వెంకటేశ్‌యాదవ్‌ల నుంచి సిట్ అధికారులు రాబట్టారని సమాచారం.
వందల కోట్లు వసూళ్లు
నయీం పలువురు రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారులను బెదిరించి రూ.వందల కోట్ల నగదు వసూలు చేశాడు. ఇందులో నుంచే ఎప్పటికప్పుడు అన్ని స్థాయిలలోని అధికారులు, నాయకులు, పోలీసులకు మామూళ్లు ముట్టచెప్పేవాడు.
విలువైన భూముల కబ్జా వ్యవహారంలో కొందరు పోలీసులు ఇచ్చి సలహాలతోనే ముందుకెళ్లేవాడని సిట్ విచారణలో తేలిందని తెలుస్తోంది. నయీం అనుచరుడు పాశం శ్రీనును పోలీసులు తమ కస్టడీకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే.
ఇందులో పలు షాకింగ్ అంశాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది. వ్యాపారుల నుంచి రూ.వందల కోట్లు వసూలు చేసినట్లు ఆయన విచారణలో వెల్లడించాడని తెలుస్తోంది. పలు సెటిల్మెంట్లలో తాను ప్రత్యక్షంగా పాల్గొన్నానని చెప్పాడు.
కాగా, గ్యాంగ్ స్టర్ నయీం కీలక అనుచరుడు ఆసిఫ్ ఖాన్‌ను కోరుట్లలో పోలీసులు అరెస్టు చేశారు. ఇతని పైన పదుల సంఖ్యలో హత్య కేసులు ఉన్నాయని తెలుస్తోంది. నయీం తరఫున అతను హత్యలు, బెదిరింపులకు పాల్పడ్డట్లుగా పోలీసులు గుర్తించారు.
నయీం టార్గెట్ ఇస్తే ఆసిఫ్ ఖాన్ కచ్చితంగా చేసేవాడని తెలుస్తోంది. అంతేకాదు, ఆ పనిని వేగంగా పూర్తి చేసేవాడని సమాచారం. అతనిని విచారిస్తే మరిన్ని నయీం విషయాలు వెలుగు చూస్తాయి. నయీం కేసులో ఇటీవలే మరో 10 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications