కరోనా:ఏపీ సరిహద్దులపై కేసీఆర్ వార్నింగ్.. HYDలో తుదముట్టించాల్సిందే.. మళ్లీ పెరిగిన కేసులు
లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా తెలంగాణ అంతటా మద్యం దుకాణాలు తెరుచుకున్న వేళ కొవిడ్-19 కేసులు మరిన్ని పెరిగాయి. ప్రధానంగా ఇప్పటికే రెడ్‌జోన్‌లో కొనసాగుతోన్న హైదరాబాద్‌లో వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగానే ఉంది. ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 11 మందికి వైరస్ సోకింది. దీంతో కొవిడ్-19 కేసుల సంఖ్య 1107కు పెరిగింది. కరోనా వైరస్ వ్యాప్తిపై రివ్యూ నిర్వహించిన సీఎం కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు బుధవారం కూడా భారీగా విరాళాలు వచ్చాయి. సింగరేణి సంస్థ రూ.40 కోట్లు, లలితా జువెలర్స్ రూ.1 చెక్కును అందజేశాయి.

గ్రేటర్ లో కల్లోలం..
తెలంగాణలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, అవన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే కావడం గమనార్హం. దీంతో జీహెచ్‌ఎంసీలో కేసుల సంఖ్య 607కు పెరిగినట్లయింది. ఇక్కడ మృతుల సంఖ్య 18గా ఉంది. ఇత జిల్లాల్లో కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పట్టినా, గ్రేటర్ లో మాత్రం పెరుగుతూ వస్తుండటం కలకలం రేపుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు 1107కు చేరగా, అందులో 648 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రస్తుతానికి యాక్టివ్ కేసుల సంఖ్య 459గా ఉంది. గ్రేటర్ తర్వాతి స్థానంలో సూర్యాపేట జిల్లా(83 కేసులు), నిజామాబాద్(61), గద్వాల్(45), వికారాబాద్(37) జిల్లాలున్నాయి.

ఏపీ సరిహద్దులపై కేసీఆర్..
దేశవ్యాప్తంగా మే 17 వరకు లాక్‌డౌన్ కొనసాగనుండగా, తెలంగాణలో మాత్రం మే 29 వరకూ పొడిగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడం తెలిసిందే. బుధవారం మరోసారి కరోనా పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో కేసుల(సుమారు 1800) తీవ్రత ఎక్కువగా ఉండటం, ఏపీలో మోస్ట్ ఎఫెక్టెడ్ జిల్లాలైన కర్నూలు, గుంటూరుతో తెలంగాణను ఆనుకుని ఉన్న నేపథ్యంలో సరిహద్దుల దగ్గర అలసత్వం వహించొద్దని సీఎం హెచ్చరించారు. ఏపీ బోర్డర్లలోని గ్రామస్తుల్ని ఇటువైపునకు రానీయకుండా పకడ్బందీ నిఘా పెట్టాలన్నారు.

హైదరాబాద్‌పై స్పెషల్ ఫోకస్..
ఏపీ సరిహద్దులో అప్రమత్తంగా ఉంటూనే.. రాష్ట్రంలో మోస్ట్ ఎఫెక్టెడ్ ప్రాంతంగా ఉన్న హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాలోనే ఉంటుండటంతో ఇక్కడ రాకపోకలపై పకడ్బందీగా నియంత్రణ ఉండాలని, ఎవరికి వ్యాధి లక్షణాలు కనిపించినా, వెంటనే పరీక్షలు జరిపి, పాజిటివ్ గా తేలిన వ్యక్తులతోపాటు అతని కాంటాక్ట్స్ ను కూడా క్వారంటైన్ కు తరలించాలని సూచించారు. హైదరాబాద్ ను చుట్టుముట్టిన కరోనా వైరస్ ను ఎలాగైనాసరే తుదముట్టించాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు.

ఇక్కడ పుట్టలేదు..
‘‘కరోనా వైరస్ మన దగ్గర పుట్టింది కాదు. ఇతర ప్రాంతాల నుంచే మనకు వైరస్ వ్యాపించింది. కర్నూలు, గుంటూరు సరిహద్దులో అటువాళ్లు ఇటు, ఇక్కడివాళ్లు అటువైపు వెళ్లకుండా చర్యలు తీసుకోండి. రాకపోకల్ని ఎంత కట్టుదిట్టంగా నియంత్రించగలిగితే వైరస్ వ్యాప్తిని అంతగా అరికట్టొచ్చు. సరిహద్దుల మాదిరిగానే హైదరాబాద్ లోనూ పకడ్బందీ చర్యలు చేపట్టాలి. అందుకోసం ఆయా ప్రాంతాల్లో చురుకైన అధికారుల్నే డ్యూటీల్లో ఉంచాలి'' అని సీఎం కేసీఆర్ అన్నారు.