అధిక ఫీజుల ప్రైవేటు ఆస్పత్రులపై సర్కారు కొరఢా: మరో 15 ఆస్పత్రుల కరోనా చికిత్స లైసెన్స్ రద్దు
హైదరాబాద్/ఖమ్మం: ప్రభుత్వ నిబంధనలు, కరోనా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై తెలంగాణ సర్కారు కొరఢా ఝలిపిస్తోంది. తాజాగా, 27 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతోపాటు ఐదు ఆస్పత్రులకు కరోనా చికిత్స అనుమతులు రద్దు చేసింది.

మరో ఐదు ప్రైవేట్ ఆస్పత్రుల కరోనా సేవల రద్దు..
అమీర్‌పేట్‌లోని ఇమేజ్ ఆస్పత్రి, ఎల్బీనగర్ లోని అంకుర, కొండాపూర్‌లోని సియాలైఫ్, షాపూర్‌నగర్‌లోని సాయి సిద్ధార్థ, భూత్‌పూర్‌లోని పంచవటి ఆస్పత్రుల అనుమతి రద్దు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ నిబంధనలను, కరోనా ప్రోటోకాల్ ను పాటించని ఐదు ఆస్పత్రుల కోవిడ్ సేవల అనుమతులను రద్దు చేయడంతోపాటు మరో 64 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఖమ్మంలో 10 ప్రైవేటు ఆస్పత్రుల కరోనా లైసెన్స్ రద్దు
మరోవైపు, ఖమ్మంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన 10 ప్రైవేటు ఆస్పత్రులకు కరోనా వైద్య సేవల అనుమతులను రద్దు చేశారు. ఈ మేరకు ఖమ్మం డీఎంహెచ్ఓ డాక్టర్ మాలతి తెలిపారు. ఖమ్మం నగరంలోని విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, క్యూర్ ఆస్పత్రి, ప్రశాంతి, మార్వెల్, జనని, ఇండస్, విజయలక్ష్మి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, శ్రీబాలాజి చెస్ట్, డయాబెటాలాజీ సెంటర్, న్యూహోప్, సంకల్ప సి స్టార్ ఆస్పత్రుల కరోనా సేవలను రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లు టాస్క్ ఫోర్స్ టీం తనిఖీల్లో తేలిందని, అందుకే కరోనా అనుమతులు రద్ద చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మాలతి తెలిపారు.

ఇల్లు అమ్ముకున్నా కట్టలేనంత బిల్లులు..
కాగా, హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి రోజుకు రూ. లక్ష బిల్లు వేయడంతో తన కొడుకును కోఠిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఓ మహిళ వాపోయింది. అయితే, వెంటిలేటర్ కూడా పెట్టకుండానే సదరు ప్రైవేట్ ఆప్పత్రి రోజుకు రూ. లక్ష బిల్లు వేసిందని, తన ఇల్లు అమ్ముకున్నా అంత మొత్తం కట్టలేనని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే ప్రభుత్వ ఆస్పత్రికి తన కొడుకును తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం కరోనా చికిత్సకు గరిష్ట ధరలు నిర్ణయించినప్పటికీ.. ప్రైవేటు ఆస్పత్రులు అంతకుమించి వసూలు చేస్తున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications