రిజర్వుడ్ ఎమ్మెల్యేలకు నో ‘చాన్స్’: బ్లాక్‌లిస్టులో 20 మంది..

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: గులాబీ గూటిలో ఎన్నికల ఫీవర్‌ అప్పుడే మొదలైందా? కూడికలు, తీసివేతల కసరత్తు జరుగుతోందా? నియోజకవర్గాల పెంపుపై పెట్టుకున్న ఆశలు గల్లంతవడం, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలతో ఆశావహుల జాబితా పెరిగిపోవడంతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు టికెట్ల విషయంలో ఇప్పట్నుంచే ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

అందునా గులాబీ దళాధిపతి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో ఆయన ముందస్తు కసరత్తు మొదలుపెట్టారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు టికెట్‌ ఆశావహులు ఉండటంతో వడపోత కార్యక్రమం మొదలైనట్టు పార్టీ వర్గాల కథనం.

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని వివిధ సందర్భాల్లో తనను కలుస్తున్న జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ చెబుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతం అయ్యాయని, వివిధ వర్గాల ప్రజల్లోకి చొచ్చుకువెళ్లామని, కనీసం వంద సీట్లు గ్యారంటీ అని పేర్కొంటున్నారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నా, తెర వెనుక మాత్రం నేతలపై కట్టుదిట్టమైన సర్వే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని చెబుతున్నారు.

 వివాదాస్పద ఎమ్మెల్యేల జాబితా ఇలా

వివాదాస్పద ఎమ్మెల్యేల జాబితా ఇలా

పనితీరు సరిగాలేని వారు, ప్రజల్లో ఆదరణ కోల్పోయిన వారు, వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్యేల జాబితాతో ఓ బ్లాక్‌లిస్ట్‌ తయారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో కనీసం 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సర్వేలు, వివిధ వర్గాలతో తెప్పించుకుంటున్న సమాచారం, నిఘా విభాగాలు అందిస్తున్న నివేదికలతో ప్రజలకు దగ్గరగా ఎవరుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో వారి విజయావకాశాలు ఎలా ఉంటాయన్న అంశాలపై అధినేత దృష్టి సారించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని అసెంబ్లీ స్థానాల వారీగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ తొలినాళ్ల నుంచి పనిచేస్తున్న నేతలు సహా వెయ్యి మంది దాకా ఆశావహులు ఉన్నట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందస్తు కసరత్తులో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరంగా సర్వే జరుగుతున్నట్టు తెలిసింది. అత్యధికంగా నమూనాల సేకరణ ద్వారా కచ్చితమైన ఫలితాన్ని రాబట్టొచ్చన్న ఉద్దేశంతో ఈ సర్వే చేస్తున్నారని సమాచారం. ఒక్కో నియోజకవర్గంలోని మొత్తం ఓట్లలో మూడు శాతం శాంపిల్స్‌ తీసుకుని సర్వే చేయిస్తున్నారని, మరో పది రోజుల్లోగా ఈ సర్వే పూర్తవుతుందని అంటున్నారు. మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల అనుకూల ఫలితాలు వస్తున్నా.. ఎమ్మెల్యేల విషయానికి వచ్చే సరికి తేడా ఉందని చెబుతున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే ఈ సారి ఎక్కువ శాంపిల్స్‌ తీసుకుంటున్నారని, మండలాల వారీగా కనిష్టంగా మూడు వేల మందిని నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారని అంటున్నారు.

 గెలుపు గుర్రాల కోసం వడపోత ప్రారంభించిన సీఎం కేసీఆర్

గెలుపు గుర్రాల కోసం వడపోత ప్రారంభించిన సీఎం కేసీఆర్

2014 ఎన్నికల్లో 63 స్థానాల్లో గెలుపొందిన టీఆర్‌ఎస్‌.. తర్వాత వివిధ పార్టీల నుంచి 25 మంది ఎమ్మెల్యేలను తనలో ఇముడ్చుకోవడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 88కి చేరింది. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న ఆశతో ఎక్కువ మంది టీఆర్‌ఎస్‌ వైపు చూశారు. ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చేరారు. దీంతో సిటింగ్‌ ఎమ్మెల్యే ఉన్న స్థానాల్లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కో స్థానం నుంచి సగటున నలుగురు, ఐదుగురు నేతలు టికెట్‌ ఆశిస్తున్నారు. దీంతో గెలుపు గుర్రాల కోసం వడపోత చేపట్టినట్టు తెలుస్తోంది. వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల స్థానాలతోపాటు ఉత్తర, దక్షిణ తెలంగాణలోని కొన్ని ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బ్లాక్‌లిస్టులో ఉన్నారని అంటున్నారు. దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో కొన్ని జనరల్‌ స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలూ కూడా ఇందులో ఉన్నారని సమాచారం. సర్వేల ద్వారా సేకరిస్తున్న ఈ సమాచారంతోనే వివిధ నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని, ఇప్పటికే ఈ అంశాల ఆధారంగానే చేరికలు జరిగాయని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో సహజంగానే తమ పరిస్థితిపై ఒకింత స్పష్టత ఉన్న ఎమ్మెల్యేలు పనితీరును మెరుగు పరుచుకోవడం ద్వారా అధినేత కేసీఆర్‌ మనసు చూరగొనేందుకు నియోజకవర్గాలకే పరిమితమై వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అంటున్నారు.

 ప్రజాదరణను అనుకూలంగా మార్చుకోవాలని ‘గులాబీ' బాస్ ఎత్తు

ప్రజాదరణను అనుకూలంగా మార్చుకోవాలని ‘గులాబీ' బాస్ ఎత్తు

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ లోక్‌సభతో గాకుండా వేరుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పుడు ప్రజల్లో పార్టీకి, ప్రభుత్వానికి ఉన్న ఆదరణను అనుకూలంగా మలచుకోవాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెండింగ్‌లోని పథకాలను నెలకొకటి చొప్పున ప్రారంభించడం అందులో భాగమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయాన్ని టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలకు, కొంతమంది ప్రభుత్వ అధికారులకు సంకేతాలిచ్చినట్లు తెలిసింది. ఈ ఏడాది డిసెంబర్‌ లోపు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను పూర్తి చేయాలని, ఆయా పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నూతన సంవత్సరం సందర్భంగా తనను కలిసిన కొంతమంది పార్టీ ముఖ్య నేతలకు సీఎం సూచించినట్టు తెలిసింది. చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలంటే అధికారుల సహకారం అవసరం ఉంటుందన్న ఉద్దేశంతోనే రాష్ట్రంలో భారీగా అధికారుల బదిలీలు చేపట్టారన్న ప్రచారం జరుగుతున్నది. ఇప్పటి వరకు ఉన్న ఐఎఎస్‌ అధికారులు అభివృద్ధి పనులకు సహకరించడం లేదని.. కొంతమంది అధికారులకు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేగవంతంగా పూర్తి చేయాలంటే పాలను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, తమకు అనుకూలురైన వారిని ఆయా శాఖలో నియమించాలని పార్టీ నేతలు సీఎంపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అందులో భాగంగానే సహకరించని అధికారులకు ప్రాధాన్యత లేని శాఖలకు మార్చి, ఉపయోగపడతారన్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని తెలిసింది. నవంబర్‌, డిసెంబర్‌లోనే ఎన్నికలు ఉండొచ్చని కూడా ఒక మాట కూడా వారి చెవిన వేసినట్టు సమాచారం.

 త్వరితగతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశం

త్వరితగతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశం

టీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో అనుకూలపవనాలు ఉన్నందునే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు వినికిడి. 2019 మార్చిలో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కొత్త పార్టీలు పుట్టుకువచ్చే అవకాశం ఉందని పార్టీ భావిస్తోంది. ఈ పార్టీల వల్ల పెద్దగా నష్టం లేకపోయినా ఓట్ల శాతం తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ పార్టీలు మరింత లోతుగా ప్రజల్లోకి వెళ్లకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లితేనే లాభం ఉంటుందని పార్టీ సీనియర్‌ నాయకత్వం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరితగతంగా పూర్తి చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. చేపట్టిన పనుల్లో నిధుల కొరత అడ్డంకిగా ఉంటే వెంటనే సమాచారం అందించాలని తెలిపింది. ప్రధానంగా మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయాలని సీఎం అదేశించారు. ఈ ఏడాదిలోనే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని, అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Already in TRS Election fever comes here. TRS president and CM K chandra Shekhara Rao focused on devolopment activities and party leaders graph. Unhappy conditions in reserved assembly segments in North and South Telangana. CM KCR prioritieses winnable capacity in coming assembly election.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి