తెలంగాణలో కొత్తగా 2098 కరోనా కేసులు, ఇద్దరు మృతి: ఇంటర్ పరీక్షలపై బోర్డ్ క్లారిటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 74,083 మంది నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 2098 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,76,313కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ వివరాలను వెల్లడించింది.
గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా బారినపడి ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4099కి చేరింది. తాజాగా, కరోనా బారి నుంచి 3801 మంది కోలుకున్నాు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,226 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 629 కేసులు నమోదయ్యాయి.

ఇంటర్ పరీక్షలపై క్వారిటీ ఇచ్చిన బోర్డ్
కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లుగా దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తూ విద్యార్థులను ప్రమోట్ చేస్తూ వచ్చాయి. తెలంగాణలోనూ అలాగే జరిగింది. అయితే, తెలంగాణలో ఈసారి కూడా ప్రాక్టికల్స్ ఉండవన్నట్లు గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. కొన్ని పత్రికల్లో కూడా ఈసారి కూడా ప్రాక్టికల్స్ నిర్వహణ సందేహం అన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై ఇంటర్ బోర్డ్ స్పష్టతనిచ్చింది.
ఈసారి పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తామని బోర్డ్ తేల్చి చెప్పింది. ఈ విషయమై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. గతేడాది కరోనా కారణంగా భౌతికంగా తరగతులు నిర్వహించలేదు, కేవలం 45 రోజులు మాత్రమే తరగుతులు జరిగాయి. ఈ కారణంగానే పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేయాల్సి వచ్చింది. అయితే 2021-2022 అకాడమిక్ ఇయర్‌లో పరిస్థిలో మార్పు వచ్చింది.
జనవరిలో కేవలం 14 రోజులు మాత్రమే కాలేజీలు మూతపడ్డాయి. ఫిబ్రవరి 1 నుంచి యథాతధంగా తరగతులు కొనసాగుతున్నాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ప్రాక్టికల్ పరీక్షలను ఎప్పటిలాగే థియరీ పరీక్షలకు ముందే నిర్వహించనున్నాం. పరీక్షలను నిర్వహించుకుండానే ప్రమోట్ చేసే ఆలోచనే లేదు. ప్రాక్టికల్, థియరీ పరీక్షల షెడ్యూల్‌ను ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేయనున్నాము. విద్యార్థులంతా ఈ విషయాన్ని గమనించాలి' అని తెలంగాణ బోర్డ్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications