తెలంగాణాలో కొత్తగా 495 కరోనా కేసులు .. రికవరీల కంటే కొత్త కేసుల నమోదే అధికం
తగ్గినట్టే తగ్గి తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారతదేశంలో ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి . తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీల కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,241 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 495 కరోనా కేసులు నమోదయ్యాయి.
62వేలకు పైగా కొత్త కేసులు,289మరణాలతో కరోనా కల్లోలం .. ప్రమాదపుటంచుల్లో భారత్

గడచిన 24 గంటల్లో 495 కొత్త కేసులు , రెండు మరణాలు
దీంతో ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,05,804 కు చేరింది . ఇందులో 2,99,878 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లుగా తెలుస్తోంది. గడచిన 24 గంటల్లో కరోనాతో రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందినట్లుగా సమాచారం. దీంతో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1685కు చేరుకుంది. కరోనా బారినుండి నిన్న ఒక్కరోజే 247 మంది కోలుకున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 142 కరోనా కేసులు
ఇక పెరుగుతున్న కరోనా కేసులు మాత్రం కోల్పోయిన వారి సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో ఉంది. ప్రస్తుతం యాక్టివ్ ఉన్న కేసులు 4,241 లో 1,616 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 142 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 99,61,154 గా ఉంది. ఇక పెరుగుతున్న కరోనా కేసులతో ఇప్పటికే విద్యాసంస్థలు బంద్ చేసిన తెలంగాణ ప్రభుత్వం, కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ లాక్ డౌన్ ఉండబోదని పేర్కొంది .

పెరుగుతున్న కేసులతో అలెర్ట్ అవ్వాలని సర్కార్ ఆదేశాలు
కేసుల పెరుగుదల ఎక్కడ ఉంటే అక్కడే నియంత్రణ చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. ఇప్పటికే లాక్ డౌన్ పై రాష్ట్రంలో చర్చ జరుగుతున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండబోదని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చూడాలని, మాస్కులు లేకుంటే జరిమానాలు విధించాలని సైతం నిర్ణయించారు.