వంశీరామ్ బిల్డర్స్ పై ఇంకా ఐటీ సోదాలు- టెన్షన్ తో ఆరుగురు కుటుంబ సభ్యుల అస్వస్ధత..
హైదరాబాద్ లోని వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డితో పాటు ఆయన ఆస్తులపై నిన్నటి నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఉన్న ఆయన ఆఫీసులు, హోటళ్లు, ఇతర ఆస్తులపై ఐటీ అధికారులు విరుచుకుపడుతున్నారు. వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయంలో ఉన్న లాకర్లను బద్దలు కొట్టి మరీ మూడు బ్యాగుల్లో బంగారం కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇవాళ రెండోరోజు కూడా దాడులు కొనసాగుతున్నాయి.
వంశీరామ్ బిల్డర్స్ పై ఐటీ దాడుల నేపథ్యంలో ఓనర్ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర మానస ఒత్తిడికి గురవుతున్నారు. వీరిలో ఆరుగురు ఇప్పటికే అస్వస్ధతకు గురైనట్లు తెలుస్తోంది. వీరికి రెయిన్ బో ఆస్పత్రి వైద్యుల్ని పిలిపించి మరీ ఐటీ అధికారులు పరీక్షలు చేయించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ సోదాలు ముగిసేలోపు ఇంకా ఏమేం జరగబోతోందన్న దానిపై టెన్షన్ పెరుగుతోంది. ఇవాళ సుబ్బారెడ్డికే చెందిందని చెబుతున్న కావూరీ హిల్స్ లోని జూబిలీ రిడ్జ్ హోటల్ పైనా ఐటీ తనిఖీలు సాగుతున్నాయి.

హైదరాబాద్ లో టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అండతో నిబంధనలకు వ్యతిరేకంగా పలు స్ధలాలు కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు వంశీరామ్ బిల్డర్స్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. అలాగే పలు కమర్షియల్ కాంప్లెక్స్ లను కూడా నిర్మిస్తోంది. ఇందులోనూ పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ యుద్ధం నేపథ్యంలోనే కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే వంశీరామ్ బిల్డర్స్ ను కేంద్రం ఆదేశాలతోనే ఐటీ అధికారులు టార్గెట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications