మునుగోడులో 10రోజుల్లో 70కోట్ల మద్యం హాంఫట్.. వాళ్లకు ఫ్లైట్ టికెట్లు; అదిరిపోయే ఆఫర్లు!!
మునుగోడు ఉపఎన్నిక అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించి, తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మునుగోడులో పోటాపోటీగా తలపడుతున్నాయి. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా మోహరించిన రాజకీయ పార్టీల నాయకులు సభలు, సమావేశాలు, విందులు, వినోదాలతో ఓటర్ల మనసు గెలుచుకునేందుకు యత్నం చేస్తున్నారు.
ఇక మునుగోడు ఉప ఎన్నిక పోరు దగ్గరపడుతుండడంతో ప్రలోభాల పర్వం కూడా మునుగోడులో కొనసాగుతుంది. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా గొర్రెలు, కోళ్లకు కొరత ఏర్పడింది. తాగినోడికి తాగినంత, తిన్నోళ్లకు తిన్నంత విందు రాజకీయాలు కొనసాగుతున్నాయి. మునుగోడు లో ప్రతి ఒక్క ఓటు కీలకం కావడంతో ఓటర్ల మనసు గెలుచుకునేందుకు కోసం ప్రయత్నిస్తున్న రాజకీయ పార్టీల నాయకులు, ఇతర ప్రాంతాలలో ఉన్న ఓటర్లను మునుగోడు తీసుకురావడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

వారికి ఫ్లైట్ టికెట్లు, భారీగా నగదు.. తులం బంగారం
అందులో భాగంగా విదేశాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను రప్పించడానికి ఫ్రీగా ఫ్లైట్ టికెట్లను కూడా ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇతర ప్రాంతాలలో ఉన్న వారిని తీసుకురావటానికి కార్లు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మునుగోడులో ఓటుకు 30 వేల నుండి 40 వేల రూపాయలు ఇవ్వనున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒక తులం బంగారం ఇవ్వటానికి కూడా రాజకీయ పార్టీల నాయకులు వెనక్కి తీసుకోవడం లేదట.

మునుగోడులో 10 రోజుల్లో 70కోట్ల మద్యం అమ్మకాలు
అటు నామినేషన్ల పర్వం ఇంకా పూర్తి కాకముందే ఊపందుకున్న ప్రలోభాల పర్వంలో భాగంగా మునుగోడులో లిక్కర్ అమ్మకాలు జోరందుకున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా రంగంలోకి దిగిన రాజకీయ పార్టీల నాయకులు, అనుచరులు, ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం లిక్కర్ పంపిణీ జోరుగా చేస్తున్నారు. ఇందులో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో ఏడు మండలాల్లో 28 వైన్ షాపుల్లో ఈ నెలలో 10 రోజుల్లోనే 70.7 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి అంటే ఆశ్చర్యపోనవసరం లేదు.

రికార్డు స్థాయిలో మునుగోడులో మద్యం విక్రయాలు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నాటి నుండి మునుగోడు ఉప ఎన్నిక కోసం అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు కేంద్రంగా రంగంలోకి దిగడంతో సెప్టెంబర్ నెలలో మద్యం విక్రయాల ద్వారా 150. 6 కోట్ల ఆదాయం, ఆగస్టు నెలలో 126.7 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల 10 రోజుల్లోనే 70 కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరగగా, ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మద్యం ఏరులై పారుతుందన్న టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నిక ఇంతకు ముందు జరిగిన అన్ని ఎన్నికలకు భిన్నంగా విపరీతమైన ధన ప్రవాహంతో, ప్రలోభాలతో సాగుతున్న తీరు రాష్ట్ర ప్రజలలో ఆసక్తిని కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications