తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 2వేలకు చేరువలో..
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి భారీగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. మంగళవారం ఒక్కరోజే 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1991కి చేరింది.
తాజా కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 38 కరోనా కేసులుండటం గమనార్హం.
కాగా, మంగళవారం కరోనాతో ఒక వ్యక్తి మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 57కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1284కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

కాగా, మంగళవారం ఒక్క రోజు కరోనా నుంచి కోలుకుని 120 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 650గా ఉంది. ఈరోజు నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 38 ఉండగా, రంగారెడ్డి జిల్లా పరిధిలో 7, మేడ్చల్ జిల్లాలో 6 కరోనా కేసులను గుర్తించారు.
సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, నారాయణపేట జిల్లాల్లోనూ ఒక్కో కరోనా కేసు చొప్పున గుర్తించారు. 12 మంది వలస కార్మికులకు కూడా వీరిలో ఉన్నట్లు తెలిపింది. మరో నలుగురు విదేశీయులు కూడా ఉన్నారని వెల్లడించింది.
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,373కు చేరింది. ప్రస్తుతం 81,159 యాక్టివ్ కేసులున్నాయి. కోలుకున్నవారి సంఖ్య 62,000 కాగా, మరణాల సంఖ్య 4,203కు చేరింది.












Click it and Unblock the Notifications