తెలంగాణలో కరోనా పంజా: ఒక్కరోజే 79 పాజిటివ్ కేసులు, 50 మంది డిశ్చార్జ్..
తెలంగాణ రాష్ట్రంపై కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం 31 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఆదివారం ఆ సంఖ్య 33కి చేరింది. సోమవారం ఏకంగా రెట్టింపై.. 79కి చేరింది. దీంతో ఆందోళన నెలకొంది. వైన్ షాపులు తెరవడం వల్లే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి.

79 పాజిటివ్ కేసులు
79 పాజిటివ్ కేసులతో వైరస్ సోకిన మొత్తం కేసుల సంఖ్య 1275కి చేరింది. ఈ 79 కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. బల్దియా పరిధిలోని మూడు జిల్లాలు మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ రెడ్ జోన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం 801 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ ఒక్కరోజే 50 మందిని ఇంటికి పంపించారు. హైదరాబాద్ నుంచి 42 మంది, సూర్యాపేట 4, నిర్మల్, ఆసిఫాబాద్, మేడ్చల్, కరీంనగర్ నుంచి ఒక్కొక్కరినీ డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 444 మందికి చికిత్స అందిస్తున్నారు.

నో కేసు
ఇప్పటివరకు వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తిలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. గత 14 రోజుల నుంచి కరీంనగర్, సిరిసిల్లా, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణ్ పేట్, వరంగల్ అర్బన్, జనగామ, గద్వాల, నిర్మల్ జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు.

25 కేసులు
జియాగూడ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే డివిజన్ పరిధిలో 25 మందికి కరోనా సోకింది. డివిజన్‌లో వైరస్ బారిన పడి దవాఖానలో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యుల నుంచి రక్త నామునాలను సేకరించి వైద్యపరీక్షలు నిర్వహించగా పెద్ద మొత్తంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దుర్గానగర్ ప్రాంతంలో ఇటీవలే ఓ వ్యక్తికి వైరస్ వచ్చింది. ఆ వ్యక్తి కుటుంబంలోని ఐదుగురికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందరికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఇద్దరికి సోకిన వైరస్
జియగూడ వెంకటేశ్వరనగర్‌లో విశ్రాంత ఉద్యోగి కరోనా పాజిటివ్‌తో ప్రాణాలు కోల్పోయాడు. రిటైర్డ్ ఉద్యోగి కూతురు, కోడలు, పక్కింట్లో ఉన్న మరో యువకుడికికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. సబ్జీమండి ప్రాంతంలోని మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అతని కుమారునికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇందిరానగర్‌లోని ఓ మహిళకు పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీంతో కుమారునికి పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటివ్ నిర్ధారణ వచ్చింది.
Recommended Video

68 కేసులు
శ్రీ సాయినగర్‌లోని రిటైర్డ్ ఉద్యోగి కరోనాతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో ఐదుగురు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దుర్గానగర్ ప్రాంతంలోని బియ్యం దుకాణం వ్యాపారికి ఇదివరకే పాజిటివ్ నమోదు కాగా వారి ఇంట్లో ఇద్దరు కుమారులు, భార్య, తల్లికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరందరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జియగూడ డివిజన్ పరిధిలో మొత్తం 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications