పెద్ద గోల్కొండలో 800 ఏళ్ల నాటి వినాయకుడి విగ్రహం గుర్తింపు
హైదరాబాద్: నగర శివారులో ఔటర్ రింగ్ రోడ్డు(ORR)ను ఆనుకుని ఉన్న పెద్ద గొల్కొండ గ్రామంలో చాళుక్యుల కాలం నాటి వినాయకుడి విగ్రహాన్ని గుర్తించినట్లు చరిత్రకారులు తెలిపారు. ఈ గణేశ్ విగ్రహం క్రీ.శ. 12వ శతాబ్ది నాటిదని వెల్లడించారు.
చరిత్ర పరిశోధకులు డాక్టర్ ఎస్ జైకిషన్ ఇచ్చిన సమాచారం మేరకు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్వాహకులు శ్రీరామోజు హరగోపాల్, బీవీ భద్రగిరీష్ బృందం శనివారం శంషాబాద్ మండలం పెద్ద గొల్కోండలోని భగీరథ శివాలయం, ఆంజనేయ ఆలయాల్లోని చారిత్రక శిల్పాలను పరిశీలించారు.

శివాలయం ముందు మూడు అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు, 2 అడుగుల మందంతో నల్లశాన రాతిపై చెక్కిబడిన గణేశుడి విగ్రహం ఉందన్నారు. ఇది 800 ఏళ్ల నాటి కళ్యాణి చాళుక్యుల శిల్పశైలికి అద్ధం పడుతుందన్నారు. గణపతి రెండు చేతుల్లో దంతం, కుడుము ఉన్నాయని, తలపై చిన్న కిరీటం, లలాటహారం, ఉదరబంధం, నాగయజ్ఞోపవీతం, బాహువలయ కంకణాలు, కాళ్లకు కడియాలు ధరించి లలితాసనంలో కూర్చొని ఉన్నాడని తెలిపారు.

గణేశుని విగ్రహం పక్కన కాకతీయ స్తంభం, కప్పురాయి, శిఖర శిథిలాలు, ఆంజనేయ ఆలయంలో క్రీ.శ. 13వ శతాబ్ధికి చెందిన ఉమామహేశ్వర శిల్పం, నంది విగ్రహాలున్నాయని తెలిపారు. వాటిని శివాలయం నుంచి ఇక్కడికి తరలించారని స్థానికులు తెలిపారన్నారు. ఇవి హైదరాబాద్ నగర చరిత్రను మరో 400 సంవత్సరాల ముందుకు తీసుకెళ్తున్నాయని చెప్పారు. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ శిల్పాలపై ఉన్న రంగులను తొలగించి పీఠాలపై నిలబెట్టాలని, వాటి చారిత్రక వివరాలతో ఫలకాలను ఏర్పరచాలని కోరారు.












Click it and Unblock the Notifications