అమెరికా వెళ్లాలన్న టెక్కీ ఆశలు ఆవిరి: రోడ్డు ప్రమాదంలో మృతి
హైదరాబాద్: మరో వారంలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాల్సిన ఆ యువకుడి ఆశలు అవిరయ్యాయి. బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన హబ్సీగూడలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో అసిస్టెంట్ ఇన్ స్ట్రక్టర్‌గా పని చేస్తున్న యూసుఫ్‌అలీ.. హైదరాబాద్‌లోని వనస్థలిపురం పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన కుమారుడు మహ్మద్ సమీర్(22) ఓ పని నిమిత్తం బైక్‌పై రామాంతపూర్‌కు వచ్చాడు.

అక్కడి నుంచి హబ్సీగూడ వెళుతుండగా, స్ట్రీటర్ నెంబర్ 8 వద్ద ఓ వ్యక్తి అతడ్ని లిఫ్ట్ అడిగాడు. అతడ్ని ఎక్కించుకుంటుండగా, బైకు అదుపుతప్పి కిందపడింది. అదే సమయంలో దూసుకొచ్చిన టిప్పర్ సమీర్‌పై నుంచి వెళ్లింది. దీంతో సమీర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
అమెరికాలో చదివేందుకు వెళ్లాల్సిన తరుణంలో ఈ ఘోరం జరిగిపోయిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications