'కాయాకింగ్' బోట్ షికార్.. హైదరాబాద్ కు దగ్గర్లోనే.. బెస్ట్ వీకెండ్ ట్రిప్..
వీకెండ్ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ నగర వాసులు ఎక్కడెక్కడికి వెళ్లాలా..? అని ప్లాన్ వేస్తుంటారు. అయితే హైదరాబాద్ కు దగ్గరలో చుట్టూ కనుచూపు మేరా అటవీ ప్రాంతం.. వికారాబాద్ కొండల మధ్య ప్రకృతి రమణీయత పర్యటకులను ముగ్ధులను చేస్తోంది. వికారాబాద్ జిల్లాలోని ఈ కోట్ పల్లి ప్రాజెక్ట్ ఇప్పుడు టూరిస్ట్ స్పాట్ గా మారింది. ఈ ప్రాజెక్ట్ అందాలను తిలకించేందుకు హైదరాబాద్, వికారాబాద్ నుంచి నిత్యం పర్యటకులు వస్తుంటారు. అనంతగిరి అద్భుతాలను వీక్షిస్తూ.. అక్కడే అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉన్న నేపథ్యంలో.. ఆలయాన్ని దర్శించుకుని కోట్ పల్లి ప్రాజెక్ట్ లోని బోటు షికారు చేయడానికి నిత్యం వందలాది మంది టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. రోజురోజుకూ ఇక్కడ పర్యటకుల తాకిడి పెరుగుతోంది.
వికారాబాద్ జిల్లా ధారూర్ మండల పరిధిలోని కోట్ పల్లి ప్రాజెక్ట్ పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ బోటింగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. పిల్లా పాపలతో ఫ్యామిలీస్ ఇక్కడ బోట్ షికారును ఎంజాయ్ చేస్తున్నారు. అనంతగిరి కొండల మధ్య ఈ కోట్ పల్లి ప్రాజెక్ట్ అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ఫ్యామిలీస్ తో వస్తున్నారు. హైదరాబాద్ కు ఈ ప్రాంతం కేవలం 90 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. బెస్ట్ వన్ డే ట్రిప్ గా పర్యటకులను ఆకట్టుకుంటోంది.

ఈ కోట్ పల్లి ప్రాజెక్టు 24 అడుగుల లోతు ఉంటుంది. అలాగే దాదాపు 1800 ఎకరాల్లో విస్తరించి ఉంది. టూరిజం కేంద్రంగా అభివృద్ధి క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో సందర్శకులు కోట్ పల్లి రిజర్వాయర్ ను సందర్శిస్తున్నారు. వారాంతాల్లో అయితే వందల సంఖ్యలో ఇక్కడ టూరిస్టులు కనిపిస్తారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడే పిల్లలు, పెద్దల కోసం బోటింగ్ సదుపాయం కూడా ఉంది. బోటింగ్ లో భాగంగా దాదాపు 50 వివిధ రకాల బోట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పిల్లలతోపాటు పెద్దలు ఎంచక్కా బోటింగ్ చేసి హాయిగా నదిలో విహరించవచ్చు.












Click it and Unblock the Notifications