రహదారిపై కారును తగలబెట్టిన దుండగులు: డిక్కీలో మృతదేహం, కారు ఎవరిదంటే?
హైదరాబాద్: మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో దారుణ ఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంతానికి సమీపంలో రోడ్డు పక్కన దుండగులు ఓ కారును దగ్ధం చేశారు. అయితే, ఆ కారు డిక్కీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కాలిపోయిన స్థితిలో ఉండటాన్ని స్థానికులు గమనించారు. పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్, సీఐ స్వామిగౌడ్, నర్సాపూర్ సీఐ లింగేశ్వరరావు, నారాయణపేట సీఐ నాగార్జున గౌడ్, పోలీసు సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కారు ముందు సీట్లో.. వెనుక సీట్లో ఎవరూ లేరు. కానీ, డిక్కీలో కాలిపోయిన మృతదేహం కనిపించింది. ఎవరో ఒక వ్యక్తిని దుండగులు హత్య చేసి, ఆ తర్వాత కారులో ఇక్కడికి తీసుకొచ్చి తగలబెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంటల్లో కాలిబూడిదైన కారును పోలీసులు గుర్తించారు.

టీఎస్ 05 ఈహెచ్ 4005 నెంబర్ గల ఈ హోండా సివిక్ కారు మెదక్ పట్టణానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. కానీ, ఇప్పటివరకు శ్రీనివాస్ విషయం కూడా బయటకు రాలేదు. అయితే, మెదక్‌లోని శ్రీనివాస్ ఓ సినిమా టాకీస్ యజమానిగా ఉన్నారని తెలిసింది. కారు నెంబర్ ఆధారంగా ఓనరు పేరును గుర్తించారు పోలీసులు. కానీ, కారులో దహనమైన వ్యక్తి ఎవరన్నది ఇప్పటి వరకు తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. విచారణ చేపట్టి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

బీరువా పడి చిన్నారి మృతి
బోడుప్పల్ దేవేందర్ కాలనీలో విషాదం నెలకొంది. తల్లి వెంట వెళ్లిన కుమార్తెపై ప్రమాదవశాత్తు బీరు పడటంతో ఆమె మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ దేవేందర్ నగర్ కాలనీలో నివసించే కంచాల మధు, లత దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. లత స్థానిక సిద్ధార్థ పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. కాగా, సోమవారం పాటశాలలో పని నిమిత్తం లత కుమార్తె కీర్తి(8)తో కలిసి వెళ్లింది. బీరువాలు శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒకటి చిన్నారిపై పడింది. తీవ్రగాయాలపాలైన బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చిన్నారి మరణించిందని వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని మేడిపల్లి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాలంటూ బాలిక తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వారికి విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications