పెళ్లైన నాటి నుంచే గొడవలు: భార్యను సజీవ దహనం చేశాడు
ఆదిలాబాద్: భార్యతో తరచూ గొడవపడే భర్త.. వారికి ఆడపిల్ల సంతానం కావడంతో మరింత దారుణంగా ప్రవర్తించాడు. ఏకంగా భార్యను సజీవదహనం చేశాడు ఆ దుర్మార్గుడు.
ఈ దారుణ ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

తొమ్మిదేళ్ల క్రితం వివాహం
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. జైనథ్ మండలంలోని అడ గ్రామానికి చెందిన ఉగ్గె సరిత(27), నితీష్‌లకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు వెంకటేష్(4), కుమార్తె దను(మూడు నెలలు) ఉన్నారు.

తీవ్రమైన గొడవలు
సంసారంలో కలతల కారణంగా వివాహమైన నాటి నుంచే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వస్తున్నాయి. మూడు నెలల కిందట కుమార్తె జన్మించిన తర్వాత అవి తీవ్రమయ్యాయి.

మద్యం మత్తులో..
ఈ పంచాయితీ పలుమార్లు పెద్దల వరకు వెళ్లగా వారు సర్దుబాటు చేశారు. సోమవారం ఉదయం మరోసారి భార్యాభర్తలు గొడవపడ్డారు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన నితీష్ ఫూటుగా మద్యం తాగి మధ్యాహ్నం ఇంటికొచ్చాడు.

సజీవ దహనం చేశాడు..
భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. స్థానికులు చూస్తుండగానే ఆమె మంటల్లో కాలిబూడిదైంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నితీష్‌తోపాటు ఆయన తల్లిదండ్రులపైనా కేసు నమోదు చేస్తున్నారు పోలీసులు.












Click it and Unblock the Notifications