వివాహేతర సంబంధం: అడ్డుగా ఉందని కూతురు హత్య, పొలంలో పూడ్చారు
పిడుగురాళ్ల మండలంలో జరిగిన ఐదేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. తల్లి వివాహేతర సంబంధమే ఆమె హత్యకు దారితీసిందని తేల్చారు.
గుంటూరు: పిడుగురాళ్ల మండలంలో జరిగిన ఐదేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. తల్లి వివాహేతర సంబంధమే ఆమె హత్యకు దారితీసిందని తేల్చారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి ఆమె తల్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో బాలికను హత్య చేసిన నిందితులను అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా బుధవారం పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో సత్తెనపల్లి డీఎస్పీ ఎం మధుసూదనరావు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌కు చెందిన సాతులూరి ఫణికుమార్‌కు అక్కడే నివసించే వల్లెపు రేణుకకు పరిచయం ఏర్పడింది. అప్పటికే
రేణుకకు ఐదేళ్ల సుజాత అనే కుమార్తె ఉంది.

కాగా, గత ఆరు నెలల నుంచి ఫణికుమార్, రేణుకలు అక్కడే సహజీవనం చేస్తున్నారు. జూన్ 14న ముగ్గురూ కలిసి పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామానికి వచ్చి, అతని అమ్మమ్మ ఇంటిలో ఉంటున్నారు. వారి సహజీవనానికి బాలిక అడ్డు వస్తోందని, జులై 4న రాత్రి ఫణికుమార్ ఆ బాలికను నేలకేసి కొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో బాలి మృతి చెందింది.
మృతదేహాన్ని ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనం మీద తీసుకెళ్లి అడిగొప్పల సమీపంలోని సాగర్ కాల్వ పక్కనే ఉన్న పొలంలో పూడ్చారు. తర్వాత హైదరాబాద్‌కు వెళ్లారు. రైతు పొలాన్ని దున్నుతుండగా మృతదేహం బయటపడింది. వెంటనే ఆ రైతు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
పోలీసుల విచారణలో ఫణికుమార్, రేణుక పాపను హతమార్చినట్లు తేలింది. నిందితులు ఇద్దరు బుధవారం పిడుగురాళ్ల తహశీల్దారు కార్యాలయంలో లొంగి పోయారు. నిందితులను అరెస్టు చేశామని, కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు.












Click it and Unblock the Notifications