మద్యానికి బానిసై.. కన్న బిడ్డనే అమ్మేందుకు యత్నించిన తండ్రి
వరంగల్: ప్రేమించి పెళ్లి చేసుకొని, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తాగుడుకు బానిసగామారిన ఓ కసాయి తండ్రి.. కన్నకొడుకును విక్రయించేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని పసిగట్టిన అతని భార్య కొడుకుతో సహా పారిపోయి వరంగల్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. బాధితురాలిని స్థానిక పోలీసులు చేరదీసి స్వదార్‌హోంకు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ కనకదుర్గమ్మ గుడి సమీపంలో నివాసముంటున్న సల్మాకు తల్లితండ్రులు, బంధువులు లేకపోవడంతో ఓ హాస్టల్ వార్డెన్ చేరదీసి యుక్తవయసు వచ్చేంత వరకు పెంచి పెద్దచేసింది.
ఈ క్రమంలో ఆదే ప్రాంతంలో నివసించే రాజు అనే వ్యక్తి సల్మాను ప్రేమించడంతో వార్డెన్ అతనితో వివాహం జరిపించింది. వివాహమైన ఏడాదికి వీరికి ఓ మగబిడ్డ జన్మించాడు. ఆ తర్వాత తాగుడుకు బానిసగా మారిన రాజు తన బిడ్డ రఫీని విక్రయించాలని తరచుగా యత్నించాడు.

పలుమార్లు తప్పించుకున్నా.. రాజు తన ప్రయత్నాలను విరమించుకోకపోగా నాలుగు రోజుల క్రితం రఫీని మరోమారు విక్రయించేందుకు కుట్ర పన్నాడు. రాజు వ్యవహారాన్ని గమనించిన సల్మా.. కొడుకు రఫీని తీసుకొని విజయవాడ నుంచి రైలులో కేసముద్రం వచ్చింది.
నాలుగు రోజులుగా రైల్వే స్టేషన్లో తలదాచుకుంటోంది. మంగళవారం పోలీసులు సల్మాను ఆరా తీయగా తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో ఆమెను బిడ్డతో సహా వరంగల్ నగరంలోని స్వదార్‌హోంకు తరలించారు.












Click it and Unblock the Notifications