రేపే కేసీఆర్ విగ్రహ ఆవిష్కరణ-సీఎంపై అభిమానంతో ఏర్పాటు-రాష్ట్ర అవతరణ రోజునే
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని చిల్పూరు మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ ఉద్దెమారి రాజ్‌కుమార్ తన సొంత ఖర్చులతో దీన్ని ఏర్పాటు చేశారు. బుధవారం(జూన్ 2) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
కేసీఆర్‌పై అభిమానంతో రూ.5లక్షలు వ్యయంతో ఆయన విగ్రహం తయారు చేయించినట్లు సర్పంచ్ రాజ్ కుమార్ వెల్లడించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో మండల కేంద్రంలోని ప్రకృతి వనంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సర్పంచ్‌గా ఎన్నికైన నాటి నుంచి గ్రామ అభివృద్ది కోసం తాను ఎంతగానో కృషి చేస్తున్నానని చెప్పారు. మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్దికి కూడా రాజ్ కుమార్ తన వంతు కృషి చేశారని స్థానికులు చెబుతున్నారు.

తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాల్లో జాతీయ పతాకం ఆవిష్కరణకు ప్రముఖుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలకు లోబడి వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. మొదట తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని.. వేదిక వద్ద 10 మందికి మించరాదని సూచించింది. ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఎలాంటి ప్రసంగాలు, బహుమతుల పంపిణీ, ఆస్తుల పంపిణీ ఉండరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం... ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో బుధవారం(జూన్ 2) ఉదయం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు మంత్రులు, ప్రముఖులు పతాకావిష్కరణ చేయనున్నారు.
ఆదిలాబాద్‌లో ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, భద్రాద్రి కొత్తగూడెంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్, జయశంకర్ భూపాలపల్లి-ప్రభుత్వ విప్,భాను ప్రసాదరావు, జనగామలో ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు,కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్, మంచిర్యాలలో ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ సహా ఆయా జిల్లాల్లో పలువురు ప్రముఖులు జాతీయ పతాక ఆవిష్కరణలో పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications