బీజేపీకి షాక్.. భవిష్యత్ ఎన్నికలపై మునుగోడు ఎఫెక్ట్; అంతర్మధనంలో బీజేపీ నేతలు!!
మునుగోడు ఉపఎన్నిక భారతీయ జనతా పార్టీకి ఊహించని షాక్ ఇచ్చిందా? మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించి టిఆర్ఎస్ దూకుడుకు చెక్ పెట్టాలని భావించిన బిజెపి ఊహించని దెబ్బతో అంతర్మథనంలో పడిందా? మునుగోడు ఉపఎన్నిక ఫలితం బీజేపీకి భవిష్యత్తు ఎన్నికలపై ప్రభావం చూపిస్తుంది అన్న భావన సర్వత్రా వ్యక్తమవుతుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితం
మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందరికంటే ఎక్కువగా తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి మధ్య ప్రచ్చన్న యుధ్దంగా మారింది. తెలంగాణాలో టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా అని చెప్పాలని ప్రయత్నం చేసిన బిజెపి మునుగోడు ఉప ఎన్నికను కీలకంగా భావించింది. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వాలని భావించిన బిజెపికి మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ఊహించని షాక్ ఇచ్చింది.

దుబ్బాక, హుజురాబాద్ తరహాలో మునుగోడు ఫలితం వస్తుందని కలలు కన్న బీజేపీ
నవంబర్ నెల తమకు కలిసొస్తుందని భావించిన బిజెపికి, ఈ నవంబర్ నెల కోలుకోలేని దెబ్బ కొట్టింది. గతంలో ఉప ఎన్నికలు జరిగిన దుబ్బాక, హుజురాబాద్ లలో బిజెపికి ప్రజలు పట్టం కట్టగా, మునుగోడులో కూడా బీజేపీకి ప్రజలు పెద్దపీట వేస్తారని భావించారు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. బిజెపి మునుగోడు లో పరాజయం పాలైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మరింత పట్టు సాధించే అవకాశం ఉంటుందని, భవిష్యత్తు ఎన్నికలలో టిఆర్ఎస్ కు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని కలలు కన్న బిజెపి కలలు కల్లలుగా మారాయి.

భవిష్యత్ ఎన్నికలపై ఇప్పటి నుండే అంతర్మధనంలో బీజేపీ
ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే రాష్ట్రంలో టిఆర్ఎస్ బలహీన పడిందని చూపించాలని బిజెపి నేతలు భావించారు. కానీ అందుకు భిన్నంగా టిఆర్ఎస్ విజయం సాధించడం బిజెపి నేతలకు మింగుడు పడడం లేదు. దీంతో భవిష్యత్తు ఎన్నికలకు ఏ విధంగా వెళ్లాలి? భవిష్యత్తు ఎన్నికల్లో మునుగోడు ఉపఎన్నిక ఫలితాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అన్నది బీజేపీ నేతలను ఆలోచించేలా చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పాలన పై ప్రజలను తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతున్న బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో ఆ వ్యతిరేకతను ఓటు బ్యాంకుగా మార్చుకోలేకపోయింది. ప్రజలలో టిఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉందని నిరూపించలేక పోయింది. దీంతో ఇప్పుడు బిజెపి ప్రజల్లోకి మళ్లీ ఏ విధంగా వెళ్లాలి అన్న ఆలోచనలో పడిపోయింది.

ఈ ఓటమి బీజేపీ పట్టును తగ్గిస్తుందా? నెక్స్ట్ ఏంటి?
ఈ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తే రాష్ట్రంలో బీజేపీకి పట్టు మరింత పెరిగేది. కానీ ప్రస్తుతం గతంలో ఉన్న పట్టు కూడా బిజెపికి తగినట్టుగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో బిజెపి మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమికి గల కారణం ఏమిటి? ఎక్కడ లోపం జరిగింది? భవిష్యత్తులో చేయాల్సిందేమిటి? ప్రజాక్షేత్రంలో మళ్లీ ప్రజల మద్దతు పొందడానికి, బిజెపి పట్టును సాధించడానికి ఏం చేయాలి? వంటివాటిపై దృష్టి పెట్టనుంది. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం బీజేపీకి రాష్ట్రంలో కాస్త ఇబ్బందికర పరిస్థితిని తీసుకువచ్చింది.












Click it and Unblock the Notifications