వీడియో: హైదరాబాద్‌లో కేంద్ర ఎన్నికల బృందం- అసెంబ్లీ పోరు షెడ్యూల్ విడుదలపై ఉత్కంఠత
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అక్టోబర్ 10వ తేదీ లోపే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. 7 లేదా 8వ తేదీల్లో షెడ్యూల్ విడుదల అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సరిగ్గా నెల రోజుల తరువాత పోలింగ్ ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) కసరత్తు పూర్తి చేస్తోంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. షెడ్యూల్ విడుదల కావడానికి ఎంతో సమయం లేకపోవడం వల్ల అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముమ్మరం చేసింది.

అటు కాంగ్రెస్ (Congress), భారతీయ జనతా పార్టీ (BJP) ఈ సమరానికి రెడీ అయ్యాయి. బీఆర్ఎస్ (BRS) నుంచి వలస వచ్చిన నాయకుల చేరికతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao), మైనంపల్లి హన్మంతరావు, వేముల వీరేశం (Vemula Veeresham) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
మహబూబ్ నగర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనతో బీజేపీలో జోష్ పెరిగింది. ఈ సాయంత్రం మరోసారి ఆయన తెలంగాణకు రానున్నారు. నిజామాబాద్‌లో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మూడు రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ రెండోసారి తెలంగాణకు వస్తోండటం బీజేపీ క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపింది.
ఈ పరిణామాల మధ్య- కేంద్ర ఎన్నికల కమిషన్ (ECI) తెలంగాణ (Telangana)లో పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్దిసేపటి కిందటే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. 5వ తేదీ వరకు వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు.
#WATCH | Hyderabad, Telangana: Central Election Commission team arrives at Shamshabad Airport. pic.twitter.com/N591ssvh2I
— ANI (@ANI) October 3, 2023
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌తో రాజీవ్ కుమార్ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించనున్నారు. వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే ముందు అన్ని కోణాల్లోనూ పోలింగ్ నిర్వహణపై ఆరా తీయనున్నారు.
షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసిపోయేంత వరకు నిర్వహించాల్సిన రోజువారీ కార్యాక్రమాలకు సంబంధించిన క్యాలెండర్‌ను ఈసీ ఇప్పటికే రూపొందించిన విషయం తెలిసిందే. తుది దశలో ఈవీఎంలు, వీవీప్యాట్, స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేయడం, పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన వంటి కార్యక్రమాలపై ఈసీ అధికారులు సమీక్ష నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications