JPSల నిరసనలో విషాదం: మహిళా జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య
వరంగల్: తమను రెగ్యూలరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు(JPS) నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం విషాదం నెలకొంది. వరంగల్ జిల్లాలో ఓ మహిళా జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖానాపూర్ మండలం రంగాపురం గ్రామ కార్యదర్శి సోని పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు.
సమ్మె విరమించి గురువారం విధుల్లో చేరిన సోని.. విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న తర్వాత పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోని శుక్రవారం మృతి చెందారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

కాగా, తమను రెగ్యూలరైజ్ చేయాలంటూ గత 15 రోజులుగా విధులు బహిష్కరించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు.. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు, మండల పరిషత్ కార్యాలయాల వద్ద నిరనలు చేస్తున్నారు. ీ క్రమంలోనే జేపీఎస్ లు తమ నిరసనలు ఆపేసి విధుల్లో చేరాలని.. లేదంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది ప్రభుత్వం.
9వ తేదీ సాయంత్రం కల్లా విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు జేపీఎస్‌లకు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా నోటీసులు జారీ చేశారు. అయితే, ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సమ్మెను కొనసాగిస్తున్నారు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు. శుక్రవారం వివిధ రూపాల్లో జేపీఎస్ లు తమ నిరసనను వ్యక్తం చేశారు.
కొందరు ఒంటి కాలిమీద నిలబడి నిరసన తెలిపితే.. మరికొంతమంది మోకాళ్ల లోతు నీటిలో నిల్చుకున్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని.. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications