సేల్స్ గర్ల్ జీనత్ దారుణ హత్య: అత్యాచారం చేశారని అనుమానం
హైదరాబాద్: హైదరాబాదులోని పాతబస్తీలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఒంటరిగా ఉంటున్న సేల్స్ గర్ల్‌ను దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఈ దారుణమైన సంఘటన హైదరాబాదులోని యాకుత్‌పురాలో జరిగింది.

దబీర్‌పురా పోలీసుల కథనం ప్రకారం - ఆబిడ్స్‌లోని రూప్ సాగర్ షోరూంలో ఉద్యోగం చేస్తున్న జీనత్ (35) బాల్‌షెట్టి ఖేత్ ప్రాంతంలో ఓ అపార్టుమెంట్ పెంట్ హౌస్‌లో మూడేళ్లుగా ఒంటరిగా ఉంటూ వస్తోంది. మంగళవారం ఆమె హత్యకు గురైందని జీనత్ స్నేహితుడు మొహిసిన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొహిసన్ గతంలో ఈ షోరూంలోనే పనిచేశాడు.
కొన్నాళ్ల క్రితం జీనత్ తనను రూ.3000 అడిగిందని, ఇవ్వడానికి మంగళవారం ఆమె గదికి వెళ్లానని, దాంతో ఆమె హత్యకు గురై ఉండడం చూశానని అతను చెప్పాడు. ప్రతిసారీ తానే ఆెమ అద్దెకుండే ఇంటి యజమానికి అద్దె చెల్లించేవాడినని చెప్పాడు.

హత్య తెల్లవారు జామున గానీ రాత్రి గానీ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతురాలి వివరాలేవీ స్థానికులకు తెలియవు. జీనత్ ముఖాన్ని దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని సిఐ మట్టయ్య చెప్పారు. మెడపై గాట్లు ఉండడంతో ఆమెపై అత్యాచారం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మృతురాలి స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications