అగ్గిపెట్టె అడిగిన పాపానికి ప్రాణం తీసిన గ్యాంగ్ .. ఫుల్లుగా తాగి ఘర్షణ .. యువకుడు హతం
అగ్గి పెట్టె ప్రాణం తీస్తుంది అంటే మీరు నమ్ముతారా ? వరంగల్ జిల్లాలో సరిగ్గా అదే జరిగింది . అగ్గిపెట్టె ఒకరి జీవితాన్ని కాల్చేసింది . ఒక అగ్గిపెట్టె వ్యక్తి ప్రాణం తీసింది. అగ్గిపెట్ట అడిగిన పాపానికి రెండు గ్యాంగుల మధ్య చెలరేగిన చిచ్చు చిలికి చిలికి గాలివానగా మారి ఒక వ్యక్తి మరణానికి కారణమైంది.
ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్స్ .. మ్యాప్ ను అనుసరించి డ్యామ్ లో పడిపోయిన కారు , ఒకరు మృతి

అగ్గిపెట్టె కోసం జరిగిన ఘర్షణ..వరంగల్ లో దారుణం
వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లేబర్ కాలనీ లో ఎంఎన్ఆర్ బార్ వద్ద అగ్గిపెట్టె కోసం జరిగిన ఘర్షణలో ఒక యువకుడు హతమయ్యాడు . ఎంఎన్ఆర్ బార్లో రెండు గ్రూపులకు చెందిన యువకులు మద్యం సేవించారు. ఫుల్లుగా మద్యం సేవించిన ఒక గ్యాంగ్ కు సంబంధించిన వ్యక్తిని , వేరే గ్యాంగ్ లో ఉన్న ఒక యువకుడు అగ్గిపెట్టె అడిగాడు. గిర్మాజీపేట్ కు చెందిన అక్కెన్ పవన్ కుమార్ బార్ పక్కనే ఉన్న పాన్ షాప్ వద్ద సిగరెట్ తాగడానికి, అక్కడే ఉన్న మరొక గ్యాంగ్ ను అగ్గిపెట్టె కావాలా అని అడిగాడు.

ఫుల్లుగా తాగి ప్రాణం పోయేలా కొట్టిన గ్యాంగ్
దీంతో వారు నీ వయసెంత ? సిగరెట్ తాగుతావా ? అంటూ ప్రశ్నించారు. నా ఇష్టం .. నీకు ఇష్టముంటే అగ్గిపెట్టె ఇవ్వు.. లేకుంటే లేదు అని పవన్ బదులిచ్చాడు. దీంతో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా చిలికి చిలికి గాలివానగా మారి వారి మధ్య ఘర్షణకు కారణమైంది. పవన్ కుమార్ పై ఒక్కసారిగా గ్యాంగ్ మూకుమ్మడిగా దాడికి దిగారు. మొత్తం ఎనిమిది మంది పవన్ కుమార్ ను చితకబాదారు. ఫుల్లుగా మద్యం సేవించి ఉన్న గ్యాంగ్ దాడికి దిగడంతో పవన్ తో పాటు ఉన్న ముగ్గురు స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు.

పవన్ అనే యువకుడు మృతి .. కేసు నమోదు
పవన్ కూడా పారిపోయే ప్రయత్నం చేసినా అతను వారికి చిక్కడంతో తాగిన మత్తులో ఇష్టారాజ్యంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలైన పవన్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పవన్ ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . అసలు దాడి చేసిన వారికి, పవన్ కు మధ్య ఎలాంటి సంబంధమూ లేదు. కేవలం అగ్గిపెట్టె అడిగిన పాపానికి అన్యాయంగా పవన్ కుమార్ ఉసురు తీశారు.