కెసిఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆప్ నేత సోమనాథ్ భారతి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సోమనాథ్ భారతి అకస్మాత్తుగా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని కె. చంద్రశేఖర రావు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆయన బుధవారంనాడు విమర్శించారు.
ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాలేసి భూమి పంపిణీ చేస్తామన్న హామీ సరిగా అమలు కాలేదని ఆయన అన్నారు. వైస్ చాన్సలర్లను నియమించకపోవడంతో ఏడాది కాలంగా తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు పని చేయడం లేదని ఆయన అన్నారు.

సోమనాథ్ భారతి ఆప్ దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఒక కుటుంబం మాత్రమే నడిపిస్తోందని ఆయన దుయ్యబట్టారు. మిషన్ కాకతీయ కార్యక్రమం వల్ల శాసనసభ్యులకు మాత్రమే మేలు జరుగుతుందని, ఇతర పార్టీల నాయకులను ప్రలోభ పెట్టడానికి అది పనికి వస్తోందని ఆయన అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యుడు కూడా అయిన సోమనాథ్ భారతి ఇటీవల తరుచుగా వార్తల్లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఆయనపై భార్య లిపిక గృహహింస కింద ఫిర్యాదు చేయడంతో వివాదం కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications