అల్లు అర్జున్ మామ చేయని ప్రయత్నమంటూ లేదు..!!
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ముసురుకున్న వివాదాలు రోజురోజుకూ తీవ్ర రూపాన్ని దాల్చుతూ వస్తోన్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన.. అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చిన తరువాత ఈ వ్యవహారం మొత్తం రోజుకో మలుపు తిరుగుతోంది. అల్లు అర్జున్‌ను మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చంద్రాయణగుట్ట శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ సహా పలువురు సభ్యులు ఈ తొక్కిసలాట ఉదంతంపై ఘాటుగా స్పందించారు. అదేరోజు సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఈ వివాదానికి అడ్డుకట్ట వేయకపోగా మరింత ఆజ్యం పోసినట్టయింది.

అనుమతి లేకుండా, బాధ్యతారహితంగా పుష్ప 2 ప్రీమియర్ షో చూడటానికి తాను సంధ్యా థియేటర్‌కు వెళ్లాననడం సరికాదని, అది తప్పుడు సమాచారమంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. దీన్నొక యాక్సిడెంట్‌గా తీసుకోవాలంటూ అభ్యర్థించారు. ఇందులో ఎవరి తప్పూలేదని చెప్పారు. సంధ్య థియేటర్ వద్ద రోడ్‌షో చేయలేదని, పోలీసుల డైరెక్షన్‌లోనే థియేటర్‌కు వెళ్లాననీ అన్నారు.
ఈ ప్రెస్ మీట్ తరువాత ఆయనపై దాడి మరింత తీవ్రతరమైంది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు బల్మూరి వెంకట్, విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్‌లో పశ్చాత్తాపం ఎంతమాత్రం కనిపించట్లేదని విమర్శించారు. పోలీసులను సైతం తప్పు పట్టేలా వ్యవహరించారంటూ ఏసీపీ విష్ణుమూర్తి మండిపడ్డారు.
అదే సమయంలో అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు జారీ చేయడం, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆయనపై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో లిఖితపూరకంగా ఫిర్యాదు చేయడం.. ఉచ్చు మరింత బిగుసుకున్నట్టయింది. ఈ ఉదయం 11 గంటలకు ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరు కానున్నారు.
ఈ పరిణామాల మధ్య- అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. గాంధీ భవన్ గడపతొక్కారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ వివాదాల గురించి ఆమెకు వివరించారు. తొక్కిసలాట సహా నోటీసుల వరకు అన్ని విషయాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారని సమాచారం.
అల్లు అర్జున్‌పై ప్రధానంగా కాంగ్రెస్ నుంచే దాడి జరుగుతోందని, దీనికి పుల్ స్టాప్ పడేలా నిర్ణయాలను తీసుకోవాలంటూ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. దీనిపై దీపా దాస్ మున్షీ నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనేది తెలియరావట్లేదు. ఈ అంశం తన పరిధిలో లేదని వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications