కేటీఆర్ కేసులో ఏసీబీ దూకుడు-అరెస్టుకు రెడీ ? ఏపీలోనూ సోదాలు..!
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిటెండ్ కేటీఆర్ నిందితుడిగా ఉన్న ఫార్ములా -ఈ కార్ రేసు కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వగానే ఏసీబీ రంగంలోకి దిగింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కేటీఆర్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడం వారికి భారీ ఊరటనిచ్చింది. దీంతో వెంటనే హైదరాబాద్ తో పాటు ఏపీలోనూ దాడులు మొదలుపెట్టేశారు. దీంతో పాటు కేటీఆర్ అరెస్టుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఫార్ములా -ఈ కార్ రేసు వ్యవహారంలో తెలంగాణ ఏసీబీతో పాటు ఈడీ కూడా విచారణ జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కేటీఆర్ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏసీబీ అధికారులు హైదరాబాద్ లోని గ్రీన్ కో కార్యాలయాల్లో తనిఖీలు ప్రారంభించారు. హైదరాబాద్ తో పాటు ఏపీలోని మచిలీపట్నంలోనూ ఈ సంస్థ రికార్డుల్ని ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు.

హైదరాబాద్ మాదాపూర్‌లోని ఏస్ నెక్స్ట్‌జెన్, ఏస్ అర్బన్ రేస్ సంస్ధల కార్యాలయాతో పాటు ఏపీలోని బందరులో ఉన్న ఏస్ అర్బన్ డెవలపర్స్ ఆఫీసుల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఎన్నికల బాండ్ల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రీన్‌కో, దాని అనుబంధంగా ఉన్న సంస్థల నుంచి బీఆర్ఎస్ కు రూ.41 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు వెళ్లిన వ్యవహారంపై ఏసీబీ దృష్టిసారిస్తోంది. తెలంగాణతో పాటు ఏకకాలంలో మచిలీపట్నంలోనూ ఏసీబీ తనిఖీలతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగుతోంది. ఈ సోదాల్లో తగిన ఆధారాలు లభిస్తే కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశాలున్నాయి. దీంతో హైదరాబాద్ లోని కేటీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.












Click it and Unblock the Notifications