కోమటిరెడ్డి వెంకరెడ్డిపై ఏఐసీసీ ఆగ్రహం - కీలక నిర్ణయం...!!
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన సమయం నుంచి వెంకటరెడ్డి వర్సస్ కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితి మారింది. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటి వరకు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనలేదు. ఇదే సమయంలో ఆయన కు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మునుగోడు లో ఒక కాంగ్రెస్ నేతకు కాల్ చేసిన వెంకటరెడ్డి ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని సూచించారు.
రాజగోపాల్ రెడ్డి అన్ని సమయాల్లో అండగా ఉంటాడని, అండగా నిలవాలని సూచించారు. దీని పైన కాంగ్రస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఆ వెంటనే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అక్కడ కొందరితో ముునుగోడు లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ - టీఆర్ఎస్ భారీగా ఖర్చు చేస్తున్నాయని కాంగ్రెస్ లో ఎవరు ఖర్చు పెట్టాలని ప్రశ్నించారు. తాను ప్రచారం చేస్తే ఒక పది వేల ఓట్లు వస్తాయని, కాని ఓడిపోయే పార్టీకి ప్రచారం ఎందుకంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలానికి కారణమయ్యాయి. దీని పైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీకి నివేదిక ఇచ్చారు.

ముందుగా వైరల్ అయిన ఆడియో కాల్ కు సంబంధించి ఏఐసీసీ పది రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని సూచిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిఖ్ అన్వర్ నోటీసులు జారీ చేసింది. సమాధానం ఇచ్చేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పది రోజుల సమయం ఆ నోటీసుల్లో నిర్దేశించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన పైన సంజాయిషి ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భారత్ జోడో యాత్ర..అటు మునుగోడు ఉప ఎన్నిక వేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లటం వివాదాస్పదంగా మారింది.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో తమ్ముడుకు వ్యతిరేకంగా పని చేయటం ఇష్టం లేకనే ఆయన విదేశీ టూర్ కు వెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి. స్ట్రేలియా లో ఆయన రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడంటూ వ్యాఖ్మానించటం పార్టీ నేతలకు రుచించటం లేదు. దీంతో..ఇప్పుడు ఏఐసీసీ నోటీసుల పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ రకంగా స్పందిస్తారనేది తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తి కరంగా మారుతోంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన తరువాత కోమటిరెడ్డి తిరిగి రాష్ట్రానికి రానున్నారు.












Click it and Unblock the Notifications