తెలంగాణ సొమ్ముతో కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించారు: బీఆర్ఎస్‌పై మోడీ సంచలనం
నిజామాబాద్: సీఎం కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటోందని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ. పలు అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టిన అనంతరం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ జనగర్జన సభలో ఆయన మాట్లాడారు. బీజేపీకి అధికారం కట్టబెడితే.. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిని కకిస్తామన్నారు.
తెలంగాణ ప్రజల దగ్గర.. కేసీఆర్ అవినీతి సొమ్మును పెడతానంటూ వ్యాఖ్యానించారు ప్రధాని మోడీ. తెలంగాణ వచ్చింది.. తెచ్చుకున్నది ప్రజల బాగోగుల కోసం అని.. కేసీఆర్ కుటుంబం కోసం కాదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ దోచుకున్న సొమ్మునంతా లెక్కతీస్తా.. తనపై నమ్మకం ఉంచి తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు మోడీ.

ప్రతి విషయంలోనూ తెలంగాణ ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోందని.. కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారన్నారు. తెలంగాణ యువత కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దని మోడీ పిలుపునిచ్చారు.
మరోవైపు, బీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్ పార్టీపైనా ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లకుపైగా పాలించి ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని, రహస్యంగా వీరి మధ్య పొత్తు నడుస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా నిలుస్తూనే ఉందన్నారు.
#WATCH | Telangana | In Nizamabad, PM Narendra Modi says, "You must remember the rule of Nizam...The country had attained independence but Hyderabad and all these areas were yet to gain independence. Nizam had created hurdles. A Gujarati son - Sardar Vallabhbhai Patel showed… pic.twitter.com/dwxmsM58ZL
— ANI (@ANI) October 3, 2023
ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా బీఆర్ఎస్ పనిచేసిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం తెలంగాణ ప్రజల సొమ్మును బీఆర్ఎస్ ఖర్చు పెట్టిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పంచుకుంటున్నాయని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ రుణం తీర్చుకునేందుకు సిద్ధమైందని ప్రధాని మోడీ తెలిపారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు చేసేందేమీ లేదని.. వారి కుటుంబాల కోసం వారి ఆరాటమని విమర్శించారు. ఈ రెండు పార్టీలను ప్రజలు దూరం పెట్టాలన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును 50 ఏళ్లుగా కాంగ్రెస్, ఇండియా కూటమి అడ్డుకుంందని మండిపడ్డారు.
గుజరాతీ బిడ్డల వల్లే తెలంగాణకు విముక్తి, అభివృద్ధి
తెలంగాణ రాష్ట్రానికి నిజాం రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించింది గుజరాత్ బిడ్డ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పుడు మరో గుజరాత్ బిడ్డనైన తాను తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తనతోపాటు బీజేపీకి ఆశీర్వాదం అందించాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications