అద్భుతంగా, కాకతీయుల కీర్తికి సాక్షిగా వరంగల్ రైల్వేస్టేషన్.. ప్రైడ్ ఆఫ్ అమృత్ భారత్!
భారతీయ రైల్వే ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలన్న ఉద్దేశంతో అమృత్ భారత పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ల పునర్ అభివృద్ధి పనులు చేస్తూ దేశవ్యాప్తంగా చాలా రైల్వేస్టేషన్లో అధునాతన వసతులతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40రైల్వే స్టేషన్ లను 2,737 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక వసతులతో ప్రయాణికులకు సౌకర్యాలను అందించడానికి రైల్వే ఆధునికీకరణ పనులను చేస్తుంది.
రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు
ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రైల్వే స్టేషన్ ను కూడా ఆధునీకరించడానికి యుద్ధ ప్రాతిపదికన పనులను చేస్తుంది. దాదాపు వరంగల్ రైల్వే స్టేషన్ పనులు సగానికి పైగా పూర్తయ్యాయని చెప్పాలి. ఓరుగల్లు జిల్లాకు ఉన్న గొప్ప చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలియజేసేలా అద్భుతమైన నిర్మాణాలతో ఆధునిక సౌకర్యాలతో రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులను చేపట్టింది.

జరుగుతున్న పనులివే
ఈ పనులలో భాగంగా కాకతీయ వాస్తు శిల్పం నుండి ప్రేరణ పొంది కాకతీయ కీర్తి తోరణాన్ని ప్రతిబింబిస్తూ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ రూపొందించారు. స్టేషన్ భవనం ముఖద్వారాన్ని అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యం కోసం 12 మీటర్లు వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేశారు. అంతేకాదు మూడు లిఫ్టులు, నాలుగు ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు.
గొప్ప అనుభూతి కలిగించేలా వరంగల్ రైల్వే స్టేషన్
ప్లాట్ఫామ్ ల వద్ద కూడా మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నారు. రైల్వే స్టేషన్ గోడలు, టాయిలెట్స్ అందమైన రంగులతో తీర్చిదిద్దారు. వెయిటింగ్ హాల్ తో పాటు రైల్వే స్టేషన్ ఆవరణలో పచ్చదనాన్ని పెంచడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వే స్టేషన్ అంటే ఒక ఆహ్లాదకరమైన ప్రాకృతిక అనుభవాన్ని కలిగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఆర్ధిక సంవత్సరంలోనే పనులు పూర్తి చెయ్యాలనే లక్ష్యం
ఇప్పటివరకు 50 శాతం పనులు పూర్తి కాగా, మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పనులను పూర్తి చేయాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదిలా ఉంటే వరంగల్ రైల్వే స్టేషన్ నుండి ప్రధాన ప్రాంతాలకు నిత్యం రైళ్ళు తిరుగుతూ ఉంటాయి.
వరంగల్ రైల్వే స్టేషన్ చాలా స్పెషల్
భారతదేశంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ ఉన్న వరంగల్ రైల్వే స్టేషన్ కు చాలా ప్రాధాన్యత ఉంది . ఇది భారీ సంఖ్యలోనే ప్రయాణికులకు సేవలను అందిస్తుంది. కాజీపేట విజయవాడ సెక్షన్ లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ 41.09 కోట్ల వార్షిక ఆదాయంతో రోజుకు దాదాపు 32 వేల మంది ప్రయాణికుల రాకపోకలతో సేవలను అందిస్తుంది. అటువంటి రైల్వే స్టేషన్ శోభాయమానంగా అమృత్ భారత్ పథకంలో భాగంగా తీర్చిదిద్దబడుతుంది.












Click it and Unblock the Notifications