ఓవైసీ అంటే ఎందుకంత భయం?: కేసీఆర్‌ను ఏకేసిన అమిత్ షా
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో చెప్పాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రశ్నించారు. సందర్భంగా హన్మకొండలో బీజేపీ నిర్వహిస్తోన్న బహిరంగ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగించారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు సుదినం అని అన్నారు. ఈరోజు తెలంగాణ విమోచన దినం అని ప్రధాని మోడీ పుట్టిన రోజు కూడా అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న మహారాష్ట్ర, కర్ణాటక విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయని గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు తెలంగాణకు స్వాతంత్య్రం రాలేదని అన్నారు.

సర్దార్ పటేల్ చొరవ, తెలంగాణ యోధుల పోరాటం వల్లే తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని పేర్కొన్నారు. భద్రకాళి, రాణీ రుద్రమదేవి పుట్టిన పుణ్యభూమి తెలంగాణ అని అమిత్‌షా కొనియాడారు. బీజేపీ శ్రేణులన్నీ కూడా సేవాదినం పేరుతో దీనిని జరుపుకుంటున్నాయని అన్నారు.
ఇది సర్దార్ పటేల్ వీరత్వం కారణంగా నిజాం తలొంచిన రోజుగా ఆయన అభివర్ణించారు. నిజాంపై పోరాటం చేసిన యోధులందరికీ తలవంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి భయపడి విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని ప్రశ్నించారు.
కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసింది తెలంగాణ ప్రజలని, వారి మనోభావాలకు అనుగుణంగా ఆయన నడుచుకోవాలని అమిత్‌షా తెలిపారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా మజ్లీస్ పార్టీకి వత్తాసు పలికితే ప్రజలే ఆయనకు గుణపాఠం చెబుతారని అన్నారు.
మీ ప్రాధాన్యం ఒవైసీ అయితే, 2019 ఎన్నికల్లో ప్రజలు మీకు గట్టిగా సమాధానం చెబుతారని అన్నారు. 2014లో కేంద్రంలో ఏర్పడిన ఎన్టీఏ ప్రభుత్వం తెలంగాణను బలోపేతం చేసేందుకు 90వేల కోట్లకు పైగా సాయం చేసిందని పేర్కొన్నారు. రైతులకు కేసీఆర్ ఇస్తానన్న రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు.
కేంద్రం పథకాలు పేదలకు చేరకుండా కేసీఆర్ కంపెనీ నీరుగారుస్తోందని మండిపడ్డారు. ప్రధాని భీమా ఇప్పటి వరకు రైతులకు చేరలేదని ఆయన అన్నారు. రైతులకు కేంద్రం ఇచ్చిన రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊరికేనే టీఆర్ఎస్‌లోకి వెళ్తున్నారా అని ప్రశ్నించారు.
'తెలంగాణలో మన ప్రభుత్వం రావాలా, వద్దా? అభివృద్ధి కావాలా వద్దా?' అని సభలో ఉన్న ప్రజల్ని ఉద్దేశించి అడిగారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి సహా పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు.
శనివారం మధ్యాహ్నాం హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా శంషాబాద్‌లో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వరంగల్ బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ జన్మదినాన్ని పార్టీ శ్రేణులు సేవా దినోత్సవంగా జరుపుతున్నారని అన్నారు.
ప్రపంచ వ్వాప్తంగా మోడీ మేనియా రోజురోజుకీ పెరుగుతూనే ఉందని అన్నారు. కాగా తెలంగాణ చరిత్రను తెలియజేయడమే లక్ష్యంగా బీజేపీ ఈ మీటింగ్ ఏర్పాటు చేసిందని పార్టీ నేతలు మీడియాకు తెలిపారు. హన్మకొండ సభలో పాల్గొన్న అనంతరం అమిత్ షా వరంగల్ నుంచి హైదరాబాద్‌కు చేరుకొని సోమవారం ఉదయం ఆయన తిరిగి ఢిల్లీకి బయల్దేరతారు.












Click it and Unblock the Notifications