
Bahubali: బాహుబలి సీన్ ను గుర్తు చేసిన నిజ జీవిత ఘటన.. వైరల్ అవుతున్న వీడియో..
తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత ఐదు రోజులుగా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలు వచ్చాయి. కాలనీలు, ఇళ్లల్లోకి భారీ వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఒడ్డున ఉన్న మంథని పట్టణంలో వరద బీభత్సం సృష్టించింది. గోదావరిలో భారీ ప్రవాహం, చుట్టు పక్కల ఉన్న చెరువులు నిండడం మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్దఎత్తున వదర నీరు చేరింది.

భారీ వరద..
పట్టణంలోని అంబేద్కర్ నగర్, మర్రివాడ, వాసవీనగర్, దొంతలవాడ, బోయిన్ పేట, లైన్ గడ్డలోని బర్రెకుంటలోకి బొక్కల వాగు బ్యాక్ వాటర్ వచ్చాయి. దీంతో కాలనీల్లో ఉన్న ఇళ్లు నీటమునిగాయి. అప్రమత్తమైన స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఈ వెళ్తున్న క్రమంలో దృశ్యం బాహుబలి చిత్రంలోని ఓ ముఖ్యమైన సీన్ ను గుర్తు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాహుబలి సీన్..
సురక్షిత ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ఓ కుటుంబం తమ నెలల పసికందును వరద నీటి నుంచి రక్షించేందుకు పడ్డ కష్టం బాహుబలి సినిమాలోని దృశ్యాన్ని గుర్తుకు తెచ్చింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ నీటిలో మునిగిపోతుంటే బాహుబలిని చేయితో పైకి ఎత్తుకుని ఉంటుంది. ఇప్పుడు అలాంటి సీన్ నిజ జీవితంలో ఆవిష్కృతమైంది. మర్రివాడకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో మూడు నెలల పసికందును కుటుంబ సభ్యులు ఒక తట్టలో పెట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
అడుగులో అడుగు వేస్తూ..
భుజాల వరకు వచ్చిన నీటిలో చిన్నారిని ఉంచిన తట్టను తల్లిదండ్రులు తమ తలపై ఉంచుకుని అడుగులో అడుగేస్తూ నడుచుకుంటు చిన్నారిని తరలించారు. ఈ దృశ్యాన్ని అక్కడే భవనంపై ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటజన్లు బాహుహలి వచ్చేశాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరైతే ఈ వీడియోకు బాహుబలి పాటను జోడిస్తున్నారు.