తెలంగాణ ఇంఛార్జీ డీజీపీగా అంజనీకుమార్: సీఐడీ డీజీగా మహేశ్ భగవత్
హైదరాబాద్: తెలంగాణ ఇంఛార్జీ డీజీపీగా అంజనీకుమార్ నియమితులయ్యారు. రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు సీఐడీ డీజీగా బాధ్యతలు అప్పగించారు. అవినీతి నిరోధక శాఖ డీజీగా రవి గుప్తా, రాచకొండ కమిషనర్‌గా డీఎస్ చౌహాన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, శాంతిభద్రతల అదనపు డీజీగా సంజయ్ కుమార్ జైన్ నియమితులయ్యారు.
రవిగుప్తాకు విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, డీజీపీ మహేందర్ రెడ్డి డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సి ఉన్నా.. పూర్తిస్థాయి నియామకంపై సర్కారు నిర్ణయం తీసుకోలేదు. దీనికి పలు కారణాలు కూడా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ ప్రకాశ్ సింగ్ దాఖలు చేసిన కేసును విచారించిన సుప్రీంకోర్టు.. దేశంలో పోలీసు సంస్కరణలకు సంబంధించి 2006లో మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ ప్రకారం అర్హులైన ఐదుగురు అధికారులతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపాలి. యూపీఎస్సీ ముగ్గుర్ని ఎంపిక చేస్తుంది. వారిలో ఒకరిని డీజీపీగా నియమించాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియ ఏ రాష్ట్రంలోనూ అమలవుతున్న దాఖలాలు లేవు. దీనిపై సుప్రీంకోర్టులోనే అనేక వ్యాజ్యాలు నడుస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే డీజీపీని ఎంపిక చేసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే కట్టబెడుతూ 2018లో తెలంగాణ 'పోలీస్ యాక్ట్' (సెలక్షన్ అండ్ అపాయింట్‌మెంట్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్) పేరుతో తెలంగాణ అసెంబ్లీ ఓ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారమే ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం జరిగింది.












Click it and Unblock the Notifications